నిర్మల్​ కాంగ్రెస్​లో గందరగోళం

నిర్మల్​ కాంగ్రెస్​లో గందరగోళం
  • పీసీసీ చీఫ్ ​రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం
  • బీజేపీలో చేరుతారని కొందరు, టీఆర్ఎస్ లో చేరుతారని మరికొందరు​
  • అయోమయంలో కాంగ్రెస్​కార్యకర్తలు 

నిర్మల్,వెలుగు: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో గట్టి పట్టున్న ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డిని టార్గెట్​చేస్తూ మాట్లాడిన తీరు దూమారం రేపుతోంది. ఇటీవల నిర్మల్​కు కొత్త డీసీసీ అధ్యక్షుడిని నియమించిన తర్వాత ఉట్నూర్ జడ్పీటీసీ చారులత, నాయకుడు భరత్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీని వెనుక మహేశ్వర్ రెడ్డి ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది.

నిర్మల్​జిల్లాకు పెద్ద దిక్కుగా...

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు. ఆయన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించారు. కానీ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుతో విభేదిస్తున్నారు. తనను సంప్రదించకుండా డీసీసీ అధ్యక్షుడి నియమించడంపై మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు ప్రాధాన్యం ఇస్తూ తనను పట్టించుకోవడం లేదని నారాజ్​గా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడి తీరుపై జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

టీఆర్ఎస్ లోకా?... బీజేపీలోకా..?

జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న పలువురు మహేశ్వర్ రెడ్డి ఎత్తులపై భిన్నాభిప్రయాలు వ్యక్తం చేస్తున్నారు.ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని కొందరు, లేదు బీజేపీలో చేరడం ఖాయమని మరికొందరు పేర్కొంటున్నారు. జిల్లా కాంగ్రెస్​పార్టీ అధ్యక్ష పదవి తన అనుచరులకు దక్కకపోవడంతో ఆగ్రహంతో ఉన్న మహేశ్వర్​రెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీలోని రావాలని చాలామంది జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి లీడర్లు మహేశ్వర్​రెడ్డిని సంప్రదించారని, టీఆర్​ఎస్​పెద్దలు కూడా మాట్లాడరని ప్రచారం జరుగుతోంది. నిర్మల్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా మహేశ్వర్ రెడ్డి పేరు ఉన్న విషయం తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ సమీకరణలపై మహేశ్వర్ రెడ్డిఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.