ఇంకా పూర్తికాని ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ

ఇంకా పూర్తికాని ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ
  • పరీక్షలకు రెండున్నర నెలలే గడువు 
  • ఆ కాలేజీల స్టూడెంట్లు వెయ్యి ఫైన్​తో ఫీజు కట్టాల్సిందే అంటున్న బోర్డు 

హైదరాబాద్, వెలుగు : ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఇంకో రెండున్నర నెలల టైమే ఉంది. అయినా ఇప్పటికీ ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ముగియలేదు. ఇప్పటికే ఎగ్జామ్స్​ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉన్నా..  ఆ ప్రక్రియ పూర్తికాలేదని తెలుస్తోంది. ఈ సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన పరీక్షల విభాగం అధికారులు లేకపోవడమే దీనికి కారణమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఇంటర్ బోర్డుకు రెగ్యులర్ సెక్రటరీ లేరు. ఎగ్జామ్స్ సీఈఓ లేరు. ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ ఓఎస్డీ లేరు. ఇవన్నీ పరీక్షల నిర్వహణకు అడ్డంకిగా మారాయి. రాష్ట్రంలో మార్చి15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆయా పరీక్షలకు సుమారు 9 లక్షలకు పైగా స్టూడెంట్లు అటెండ్ అవుతుంటారు.

ఇందు కోసం నవంబర్ నుంచే ఇంటర్ బోర్డులో ఇంటర్నల్ వర్క్ మొదలవుతుంది. డిసెంబర్ నెలాఖరు వరకూ దాదాపు సెంటర్ల గుర్తింపు ప్రక్రియ కూడా ముగిస్తుంది. ప్రస్తుతం అదేదీ బోర్డులో కనిపించడం లేదు. ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టే విద్యార్థులు వేలల్లో ఉన్నారు. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం ఇటీవలే పర్మిషన్ ఇచ్చింది. ఆయా కాలేజీలు ప్రస్తుతం అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే, ఇంటర్ బోర్డు అధికారికంగా ఆయా కాలేజీల్లో చదువుతున్న లక్ష మందికి పైగా స్టూడెంట్లు ఫీజు కట్టేందుకు అవకాశం ఇస్తుంది. ప్రస్తుతం ఆ స్టూడెంట్లు వెయ్యి రూపాయల ఫైన్​తో ఈనెల 6 లోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. అయితే తమ కాలేజీలకు సర్కారు ఆలస్యంగా అనుమతించిన నేపథ్యంలో ఫైన్  మినహాయించాలని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు కోరుతుండగా, ఇంటర్ బోర్డు అధికారులు స్పందించడం లేదు. దీంతో తాము ఫీజు కట్టబోమని మేనేజ్మెంట్లు పట్టుపట్టాయి. ఫైన్ మినహాయిస్తేనే ఫీజు కడతామని తేల్చిచెబుతున్నాయి. దీంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. 

బోర్డులో ఆఫీసర్లు లేరు..

సుమారు పది లక్షల మంది స్టూడెంట్లకు సంబంధించిన పరీక్షల నిర్వహణలో బోర్డు సెక్రటరీ తో పాటు ఎగ్జామినేషన్ విభాగం కీలకంగా ఉంటుం ది. రెగ్యులర్ బోర్డు సెక్రటరీ జలీల్ రిటైర్డ్ కావడంతో నవంబర్1 నుంచి ఇన్​చార్జ్  ఆఫీసరే ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఇన్​చార్జి అధికారికి కాలేజీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ బాధ్యతలూ ఉన్నాయి. నవంబర్ రెండో వారంలో బోర్డు సీఓఈ చనిపోయారు. అప్పటి నుంచి ఆ పోస్టులో ఎవ్వరినీ నియమించలేదు. మరోపక్క గతంలో పరీక్షల నిర్వహణలో అనుభవమున్న ఎగ్జామ్స్ ఓఎస్డీ పదవీకాలం ముగియడంతో ఆయన సేవలూ లేకుండా పోయాయి.