కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌‌పై గందరగోళం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌‌పై గందరగోళం
  • కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌‌పై గందరగోళం
  • అగ్రికల్చర్ భూములను ఇండస్ట్రియల్ ఏరియాగా ప్రతిపాదన.. రైతుల్లో ఆందోళన

కామారెడ్డి టౌన్ కొత్త మాస్టర్​ప్లాన్‌‌పై గందరగోళం నెలకొంది. ఇటీవల రిలీజ్‌‌ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌‌లో టౌన్‌‌కు సమీపంలో ఉన్న అగ్రికల్చర్ భూములను ఇండస్ట్రియల్ ఏరియాగా ప్రతిపాదించడంపై రైతులు అభ్యంతరం చెబుతున్నారు. నోటిఫికేషన్‌‌ ప్రచారంపై కూడా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పూర్తి వివరాలు లేవు. 

కామారెడ్డి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో కొత్త ప్లాన్ అమలు కోసం ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందులో భాగంగా కామారెడ్డి టౌన్‌‌కు కొత్త మాస్టర్ ప్లాన్‌‌ను ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో  రూపకల్పన చేయించారు. టౌన్‌‌తో పాటు మున్సిపాలిటీలో విలీనమైన 8 గ్రామాలను కలుపుకుని ప్లాన్ రెడీ చేశారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్‌‌ను స్టేట్​ గవర్నమెంట్ 2022 నవంబర్‌‌‌‌ 1న  ఆమోదించింది. టౌన్​ విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగాప్లాన్‌‌కు రూపకల్పన చేయాలి.  

ప్లాన్ వివరాలు ఇవే..

కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం టౌన్ విస్తీర్ణం 61. 55 చదరపు కిలో మీటర్లు. రెసిడెన్షియల్ ఏరియా 6,806 ఎకరాలు,  కమర్షియల్ ఏరియా 557 ఎకరాలు,  మల్టీ పర్పస్ 667 ఎకరాలు, గవర్నమెంట్ బిల్డింగ్స్‌‌, స్థలాలు  635 ఎకరాలు,  రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం 1,445 ఎకరాలు,  ఇండస్ట్రియల్ ఏరియాగా 1,210  ఎకరాలు ప్రతిపాదించారు. 

ఇండస్ట్రియల్ ఏరియాపై వ్యతిరేకత.. 

మాస్టర్ ప్లాన్‌‌లో ఇండస్ట్రియల్ ఏరియా ప్రతిపాదనపై ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. టౌన్‌‌కు సమీపంలో, విలీన గ్రామాలను అనుకుని ఉన్న విలువైన అగ్రికల్చర్ భూములను ఇండస్ట్రియల్ ఏరియాగా ప్రతిపాదించారు.   ఇల్చిపూర్, అడ్లూర్, టెకిర్యాల్, పాతరాజంపేటను ఇందులో చూపారు. పాత మాస్టర్ ప్లాన్‌‌లో టౌన్‌‌లోని సిరిసిల్లా రోడ్డులోని కొంత ఏరియాను ఇండస్ట్రియల్ ఏరియాగా ఉంది. ప్లాన్‌‌లో 7 నుంచి 9 శాతం ఏరియాను తప్పని సరిగా ఇండస్ట్రియల్ ఏరియాగా చూపాల్సి ఉండడంతో టౌన్ విస్తీర్ణానికి అనుగుణంగా ఆయా ఏరియాల్లో 1,210 ఎకరాలను ఇండస్ట్రియల్‌‌కు ప్రతిపాదించారు. ఇల్చిపూర్, టెకిర్యాల్ శివారులోని వందలాది ఎకరాల భూములు ఇందులో ఉన్నాయి. ప్రతిపాధించిన భూములతో పాటు వీటికి అనుకుని ఉన్న భూములకు సంబంధించి మార్కెట్‌‌లో విలువ తగ్గనుంది. ఇండస్ట్రియల్ అవసరాలకు తప్పా ఇతర అవసరాలకు సమస్యలు వస్తాయి. రెసిడెన్షియల్ నిర్మాణాలకు  మున్సిపల్ పర్మిషన్ ఇవ్వరు. ఇంటి నిర్మాణాలకు బ్యాంక్ లోన్లు రావు. ఈ పరిస్థితుల్లో తమ ఏరియా డెవలప్‌‌మెంట్‌‌పై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన  300 మందికి పైగా రైతులకు వెయ్యి నుంచి 1,500 ఎకరాల అగ్రికల్చర్ భూములు ఇల్చిపూర్ శివారులో ఉన్నాయి. ​ దీనిపై మున్సిపల్ ఆఫీసులో రైతులు అభ్యంతర పత్రాలు ఇస్తున్నారు. ః

లీడర్ల కోసమే 100 ఫీట్ల రోడ్డా!

దేవునిపల్లి నుంచి లింగాపూర్, టెకిర్యాల్ శివారుల మీదుగా నేషనల్ హైవే వరకు 100 ఫీట్ల రోడ్డును కొత్తగా ప్రతిపాదించారు. ఈ ఏరియాలో కొందరు లీడర్ల భూములు ఉన్న దృష్ట్యా 100 ఫీట్ల రోడ్డుకు ప్రతిపాదించారనే  ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌‌లో పలు రోడ్ల విస్తీర్ణాన్ని కుదించినట్లు తెలిసింది.  ఇక మాస్టర్ ప్లాన్‌‌కు సంబంధించి 2 రోజుల కింద టౌన్‌‌లో ఆయా మ్యాప్‌‌తో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో పూర్తి వివరాలు లేవు. కొత్త రోడ్ల నిర్మాణం, 100 పీట్ల రోడ్లు ప్రతిపాదన, పాత రోడ్ల వెడల్పు వివరాలు వివరంగా లేవు. ఆఫీసర్లను వివరాలు అగిడితే ఇంకా లిస్టు తయారు చేయాల్సి ఉందని చెబుతున్నారు. 

మా పరిస్థితి ఏమిటి..?

ఇల్చిపూర్ శివారులో నాకు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ భూమి ఉంది. ఇప్పుడు ఈ ఏరియాను ఇండస్ట్రియల్​ ఏరియాగా చూపెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్యూచర్‌‌‌‌లో మా భూముల విలువ తగ్గి పోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏమిటి. 
 

- కుమ్మరి రాజయ్య, రైతు, అడ్లూర్​ఎల్లారెడ్డి

అభ్యంతరాలు పరిశీలిస్తాం..

మాస్టర్ ప్లాన్‌‌కు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చాం.  జనవరి 11 వరకు అభ్యంతరాలు తెలుపవచ్చు.  ఇండస్ట్రియల్ ఏరియా, ఇతర ఆంశాలపై వచ్చిన దరఖాస్తులను పుఃన పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.  - దేవేందర్‌‌‌‌, మున్సిపల్ కమిషనర్