కాంగ్రెస్ కు 12 రాష్ట్రాల్లో గుండుసున్నా

కాంగ్రెస్ కు 12 రాష్ట్రాల్లో గుండుసున్నా

న్యూఢిల్లీ: 1.. 1.. 2.. 1.. ఈ అకెలు చాలు దేశంలో కాంగ్రెస్​ పార్టీ దీన స్థితిని అర్థం చేసుకోడానికి. లోక్​సభ సీట్ల పరంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్(80), మహారాష్ట్ర(48), వెస్ట్​బెంగాల్​(42), బీహార్​(40)లో గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ సాధించిన సీట్ల అకెలివి. నాలుగు పెద్ద రాష్ట్రాల్లోని 202 స్థానాల్లో ఆ పార్టీ కనీసం డబుల్​ డిజిట్​ కూడా నమోదుచేయలేకపోయింది. గురువారం వెల్లడైన లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ దేశవ్యాప్తంగా 51 సీట్లు మాత్రమే గెలవగలిగింది. దీంతో వరుసగా రెండోసారి ప్రతిపక్ష హోదాకు దూరమైపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​ 44 స్థానాల 543 స్థానాలున్న లోక్​సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలంటే కనీసం 10 శాతం సీట్లు, అంటే 55 సీట్లైనా ఉండాలి. 2014లో 44 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్​, ప్రతిపక్ష హోదాకు దూరమైన సంగతి తెలిసిందే. సింగిల్​గా 303 సీట్లు సాధించిన బీజేపీ లోక్​సభలో అతిపెద్ద పార్టీగా నిలవగా, దాంట్లో ఆరోవంతు తక్కువ సీట్లతో కాంగ్రెస్ పేరుకు మాత్రం​ రెండో అతిపెద్ద పార్టీగా మిగిలింది.

12 రాష్ట్రాల్లో గుండు సున్నా!

కీలకమైన గుజరాత్​, రాజస్థాన్​ సహా మొత్తం 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ఖాతా తెరవనేలేదు. మరో 11 రాష్ట్రాల్లో కేవలం ఒక్కో సీటుతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్​ సాధించిన 51 స్థానాల్లో సగానికిపైగా దక్షిణాది నుంచి లభించినవే కావడం గమనార్హం.  కేరళలో గెల్చుకున్న 15 సీట్లే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్​ సాధించిన హయ్యెస్ట్​ స్కోర్​. తమిళనాడులో డీఎంతో పొత్తు కారణంగా 8 చోట్ల, తెలంగాణలో 3, పుదుచ్చేరి 1, కర్ణాటకలో 1 సీట్లో గెలిచింది. ఉత్తరాదిలో పంజాబ్​లో 8 సీట్లు, ఈశాన్యంలోని అస్సాంలో 3, వెస్ట్​బెంగాల్​లో 2, మణిపూర్​, జార్ఖండ్​, మేఘాలయ, మధ్యప్రదేశ్​, యూపీ, మహారాష్ట్ర, బీహార్​, గోవా, ఒడిశాలో ఒక్కో స్థానం దక్కించుకున్న కాంగ్రెస్​, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్​ నికోబా​(1) సీట్లనూ గెల్చుకుంది.

ఫేస్​ టు ఫేస్​ ఫైట్​లో అట్టర్​ప్లాప్​

మూడో పార్టీ అంటూ లేకుండా బీజేపీతో ఫేస్​ టు ఫేస్​ తలపడ్డ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్​ దారుణంగా ఫ్లాపైంది. వాటిలో నాలుగు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న రాజస్థాన్​, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ కూడా ఉండటం గమనార్హం. 25 ఎంపీ సీట్లున్న రాజస్థాన్​లో ఖాతా తెరవని హస్తం పార్టీ, 29 స్థానాలున్న మధ్యప్రదేశ్​లో ఒకటి, 11 సీట్ల ఛత్తీస్​గడ్​లో 2 సీట్లు గెల్చుకుంది. గుజరాత్​, హర్యానా, హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్క సీటూ గెలవలేదు. 48 సీట్లున్న మహారాష్ట్రలో కాంగ్రెస్​(1) కంటే దాని మిత్రుడు ఎన్సీపీ(3)నే పరువు నిలుపుకుంది.

రాహుల్​ తప్పుకాదట!

మోడీ చేతిలో వరుసగా రెండోసారి దెబ్బతిన్న కాంగ్రెస్​లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. అధ్యక్షుడు రాహుల్​ గాంధీ రాజీనామా చేయాలన్న డిమాండ్​ మళ్లీ తెరపైకి వచ్చింది. బ్రహ్మాస్త్రంగా భావించిన ‘న్యాయ్’​ పథకానికి కావాల్సినంత ప్రచారం కల్పించడంలో పార్టీ విఫలమైందని, రాఫెల్​ స్కాంలో మోడీ ప్రమేయాన్ని ఉద్దేశిస్తూ రాహుల్​ చేపట్టిన ‘చౌకీదార్​ చోర్​’ నినాదం కూడా అట్టర్​ప్లాపైందనే భావన వ్యక్తమవుతున్నది. 303 సీట్లతో బీజేపీ సునామీ సృష్టించడాన్ని బట్టి.. కాంగ్రెస్​ మిగతా ప్రతిపక్షాలతో పొత్తులు పెట్టుకున్నా పెద్దగా లాభపడి ఉండేదికాదని, ఇప్పటికిప్పుడు రాహుల్​ రీబూట్​ అయి 2.0గా ప్రజల ముందుకొచ్చినా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే, జరిగిన తప్పు రాహుల్​ వల్లో, కాంగ్రెస్​లోని మరో వ్యక్తివల్లో కాదని, పార్టీ భావజాలంలోనే లోపముందని, ప్రపంచ రాజకీయాల్లో పాపులిజం హవా కొనసాగుతున్నట్లే, ఇండియాలో హిందూత్వవాదిగా ముద్రపడ్డ మోడీ వరుస విజయాలు సాధిస్తున్న క్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ నేతలు సరిగా అర్థం చేసుకోవడంలేదని విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వను, దేశభక్తితో ముడిపెట్టి మోడీ సాగించిన ఎన్నికల ప్రచారం సత్ఫలితాన్నిచ్చిందనడానికి బీజేపీ సాధించిన 303 సీట్లే నిదర్శనమని, ‘దేశభక్తి’ భావజాలం అంతర్లీనంగా పనిచేసిందని గుర్తుచేస్తున్నారు. బీజేపీ భావజాలానికి ప్రతిగా ఓట్లు రాబట్టగల సిద్ధాంతాన్ని  సోనియా గాంధీ రూపొందించలేకపోయారని, ఆమె అడుగుల్లో నడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​ కూడా మోడీని అడ్డుకోగల లేదా నిలువరించగల నినాదాన్ని ఇవ్వలేకపోయారని, ఇది కాంగ్రెస్​ భావజాలంలో ఉన్న లోపమేగానీ, వ్యక్తిగతంగా రాహుల్​ తప్పుకాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

……………………