
- దుబ్బాకలో కారుకు బ్రేకులేసి బీజేపీ హవా
- సిద్దిపేటలో తిరుగులేని నేతగా హరీశ్ రావు
- ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ అన్న కొడుక్కి ఛాన్స్?
- సీఎం గజ్వేల్ నుంచి మారితే వంటేరు ప్రతాప్‌రెడ్డికి అవకాశం
- వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్ లో ఆసక్తికర పోరు
సిద్దిపేట, వెలుగు : కేసీఆర్ అడ్డా అయిన సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, బీజెపీలు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, అసంపూర్తి పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ధరణి సమస్యలు కీలకాంశాలుగా మారనున్నాయి. వీటిపైనే ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లి తమ వాణి వినిపిస్తున్నాయి.
హరీశ్‌రావు ఎంపీగా పోటీ చేస్తే ...
సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 18 ఏండ్లుగా హరీశ్ రావుకు ఎదురులేకుండా పోయింది. 50 ఏండ్లలో ఇక్కడ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. బలమైన ప్రత్యర్థులు లేకపోవడంతో సిట్టింగ్ లు గెలుస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమం హరీశ్‌రావుకు సిద్దిపేటలో గట్టి పునాదిని ఏర్పాటు చేసింది. వ్యక్తిగత ఛరిష్మా, అభివృద్ధి , పార్టీ బలం, ప్రధాన పార్టీల్లో దీటైన అభ్యర్థులు లేకపోవడం ఆయన వరుస విజయాలకు కారణాలు. దాదాపు 98 శాతం మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన వారే ఉండడం కలిసి వచ్చే అంశం. దీంతో సిద్దిపేట నుంచి వచ్చే ఎన్నికల్లో హరీశ్ రావుకే టికెట్ దక్కుతుందని అంతా భావిస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు మారితే తప్పా ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే పూర్తిగా దృష్టి పెడితే హరీశ్‌రావును మెదక్ లేదా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశాలుంటాయంటున్నారు. ఇదే జరిగితే కేసీఆర్ అన్న కొడుకు వంశీధర్ రావుకు టికెట్దక్కే ఛాన్స్ ఉంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ వంశీధర్ రావు ఆరు నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. కాంగ్రెస్ నుంచి దర్పల్లి చంద్రం, తాడూరి శ్రీనివాస్ గౌడ్ , పూజల హరికృష్ణతో పాటు మరికొందరు రేసులో ఉన్నారు. వీరంతా ఎవరికి వారుగా వ్యవహరిస్తుండడంతో ఆ పార్టీ ప్రభావం కనిపించడం లేదు. బీజేపీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి రేసులో ఉన్నారు. నరోత్తంరెడ్డి 2018లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పెద్దగా కనిపించడం లేదు. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ సిద్దిపేట కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తానూ పోటీ చేస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గజ్వేల్ నుంచి సీఎంకు పోటీగా ఈటల?
గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ నియోజకవర్గం సెంటర్ఆఫ్అట్రాక్షన్గా మారింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ ఆయన పోటీ చేస్తే మాత్రం ప్రతిపక్ష పార్టీల్లో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి లేడనే చెప్పొచ్చు. అయితే, తాను గజ్వేల్ నుంచి పోటీలో ఉంటానని బీజేపీ లీడర్, హుజూరాబాద్ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నది. అదే జరిగితే గజ్వేల్‌లో హోరాహోరీ తప్పకపోవచ్చు. బీఆర్ఎస్ అసంతృప్తులతో పాటు బీసీలు, కాంగ్రెస్ లోని కొన్ని వర్గాల లీడర్లు, కార్యకర్తలు ఈటలకు మద్దతు పలికే అవకాశాలుంటాయి. ఈటలకు ముందు నుంచే నియోజకవర్గంలో మంచి సంబంధాలున్నాయి. కేసీఆర్మరో నియోజకవర్గానికి షిఫ్ట్అయితే ఫారెస్ట్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్‌నుంచి డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో పాటు మరో నేత జశ్వంత్ రెడ్డి రేసులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా హైలెట్ కావడం లేదు. బీజేపీ నుంచి నందన్ గౌడ్, దారం గురువారెడ్డి, నందాల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నా, వీరు సీఎం కేసీఆర్ కు పోటీ ఇచ్చే అభ్యర్థులు కారు. దీంతో బీజేపీ గట్టి అభ్యర్థి కోసం వెతుకుతోంది. పార్టీలో స్థానికంగా గుర్తింపు పొందిన లీడర్లు లేకపోవడం, ఉన్నవారంతా మండల స్థాయి నాయకులే కావడంతో బీజేపీ ఎన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చినా సక్సెస్ కావడం లేదు. నియోజకవర్గంలో బీజేపీకి ఆశించిన ఓటు బ్యాంకు కూడా లేదు. బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నా ప్రభావం చూపించలేకపోవచ్చు.
దుబ్బాక బీఆర్ఎస్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ?
తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎదురేలేదన్న ఉద్దేశంతో ఉన్న ఆ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నిక రూపంలో షాక్ తగిలింది. బై ఎలక్షన్లలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు గెలుపొందడం సంచలనంగా మారింది. ఆయన ఎన్నిక తర్వాత నియోజకవర్గంలో బీజేపీ పటిష్ట స్థితికి చేరింది. బీఆర్ఎస్ నుంచి పలువురు లీడర్లు బీజేపీలో చేరుతుండడంతో అధికార పార్టీ బలహీనపడుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనికోసం ఎంపీగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన అనుచరులతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కొడుకు సతీశ్‌రెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గతంలో రామలింగారెడ్డి వెంట నడిచిన అనుచరులను కలుస్తున్నా అంతగా మద్దతు లభించడం లేదు. అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్‌రెడ్డి, మామిడి మోహన్ రెడ్డి తమ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అవకాశం వస్తే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి రణం శ్రీనివాస్, చిందం రాజ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం చెరుకు శ్రీనివాసరెడ్డి తోపాటు శ్రవణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతుండగా, ఇటీవలే కాంగ్రెస్ లో యాంకర్ కత్తి కార్తీక రంగ ప్రవేశంతో సీన్ మారింది. ఉప ఎన్నికలో పోటీ చేసిన చెరుకు శ్రీనివాసరెడ్డి అనుచరులతో కలిసి నియోజకవర్గంలో జోడో యాత్ర నిర్వహిస్తుండగా కార్తీక కూడా జోడో యాత్ర ప్రారంభించింది. దీంతో శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా జోరు పెంచారు.
హుస్నాబాద్‌పై ‘చాడ’ ఆశలు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు మూడు జిల్లాల పరిధిలో ఉండడం అన్ని పార్టీలకు ఇబ్బందిని కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ కు ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌కు పోటీగా టికెట్ ఆశిస్తున్న వారు ఎవరూ కనిపించకున్నా, ఆయన పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పొత్తులున్నా లేకున్నా హుస్నాబాద్ నుంచి సీపీఐ తరపున పోటీకి ఆ పార్టీ నేత చాడ వెంకటరెడ్డి సిద్ధమవుతున్నారు. ఒకవేళ పొత్తు ఓకే అయితే సతీశ్‌కుమార్ సంగతి ఏమిటన్నది తేలడం లేదు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నుంచి బొమ్మ శ్రీరాం చక్రవర్తి బీజేపీలో చేరడంతో ప్రవీణ్ రెడ్డికి పోటీ లేకుండా పోయింది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఓటు బ్యాంకు ఉండడం కలిసివచ్చే అంశాలు. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టికెట్ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బండి సంజయ్ మద్దతుతో టికెట్ కచ్చితంగా తనకే వస్తుందని బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నమ్మకంతో ఉన్నారు. ఈటల రాజేందర్ ఆశీస్సులు ఉండడంతో టికెట్ తనకే వస్తుందని బీజెపీ నాయకుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి అంటున్నారు. వీరితో పాటు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, గత ఎన్నికల్లో ఓడిపోయిన చాడ శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్న మంజుల రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వైఎస్సార్ టీపీ నుంచి అయిలేని మల్లికార్జున రెడ్డి, టీడీపీ నుంచి బత్తుల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే మరో అభ్యర్థి రేసులోకి వచ్చే అవకాశం ఉంది.
గజ్వేల్ ఎమ్మెల్యే కె.చంద్రశేఖర్ రావు ( ముఖ్యమంత్రి)
అనుకూలాంశాలు
ఎనిమిదేండ్లలో నియోజకవర్గ రూపు రేఖలు మార్చడం
గజ్వేల్ రైల్వే లైన్ పూర్తి కావడం
ప్రతి పక్షాల నుంచి బలమైన
అభ్యర్థులు లేకపోవడం
నియోజకవర్గ అభివృద్ధికి రూ.వేల కోట్లివ్వడం
గ్రామ పంచాయతీలకు అదనంగా నిధులివ్వడం
ప్రతికూలాంశాలు
నియోజకవర్గ ప్రజల్ని కలవకపోవడం
మల్లన్న సాగర్, కొండపొచమ్మ సాగర్ నిర్వాసితుల సమస్యలు
గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీతో పాటు ధరణి సమస్యలు
గజ్వేల్‌లో డబుల్ ఇండ్ల పంపిణీ
పెండింగ్ ఉండడం
వర్గల్లో టీఎస్ఐఐసీ కి భూముల కేటాయింపు
సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్ రావు (ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి)
అనుకూలాంశాలు
ప్రతిపక్షాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడం
బలమైన క్యాడర్
నియోజకవర్గ అభివృద్ధి..
భారీగా నిధులు మంజూరు చేయించడం
ఇచ్చిన హామీలను నెరవేర్చడం
ప్రజలతో సత్సంబంధాలు..వీలైనంత వరకు అందుబాటులో ఉండడం
వివాదరహితుడుగా పేరుండడం
ప్రతికూలాంశాలు
ప్రభుత్వ వ్యతిరేకత, ధరణి సమస్యలు
పరిశ్రమల ఏర్పాటులో జాప్యం
కిందిస్థాయి నాయకుల వ్యవహార శైలి
అనుచరుల మట్టి, ఇసుక దందా, డబుల్ఇండ్ల పంపిణీలో అక్రమాలు
దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు(బీజెపీ)
అనుకూలాంశాలు
ప్రజలతో మమేకం కావడంతో పాటు యువతలో మంచి ఫాలోయింగ్
వాక్చాతుర్యం, బీఆర్ఎస్ పై వాడి వేడి విమర్శలు
స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ
అవినీతి ఆరోపణలు లేకపోవడం
ప్రతికూలాంశాలు
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు మంజూరు కాకపోవడం
పార్టీలోని కొందరు నాయకుల్లో అసంతృప్తి
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ (బీఆర్ఎస్)
అనుకూలాంశాలు
అవినీతి లేకపోవడం, మచ్చలేని వ్యక్తిగా పేరు
అన్ని స్థాయిల్లో బీఆర్ఎస్
ప్రజాప్రతినిధులే ఉండడం
కెప్టెన్ లక్ష్మీకాంతరావు కొడుకు కావడం
సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉండడం
ప్రతికూలాంశాలు
సంక్షేమ పథకాలు
అమలు కాకపోవడం
పూర్తి స్థాయిలో డబుల్ ఇండ్లు పంపిణీ
చేయకపోవడం
గౌరవెల్లి నిర్వాసితుల సమస్య
పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకం కాకపోవడం
పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత