వంశీ వర్సెస్​ అరుణ!

వంశీ వర్సెస్​ అరుణ!
  •     ఇద్దరి నడుమ లోకల్, నాన్​లోకల్​ వార్
  •     పాలమూరులో జోరుగా కాంగ్రెస్, బీజేపీ క్యాంపెయిన్
  •     ఎన్నికల ప్రచారం మొదలుపెట్టని బీఆర్ఎస్

మహబూబ్​నగర్, వెలుగు : పాలమూరు కాంగ్రెస్, బీజేపీ ఎంపీ క్యాండిడేట్లు వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. జనవరిలో వంశీచంద్ రెడ్డి కామెంట్లు చేయగా, ఇందుకు ప్రతిగా డీకే అరుణ కూడా కామెంట్​ చేశారు. వీరిద్దరినే రెండు పార్టీల హైకమాండ్​లు క్యాండిడేట్లుగా అనౌన్స్​ చేయడంతో వీరి మధ్య మాటల యుద్ధం పీక్స్​కు చేరింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో డీకే అరుణ ‘పాలమూరుకు ముఖ పరిచయం లేని వాళ్లు, ఇక్కడి ప్రజలతో అనుబంధం లేని వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి.

కాంగ్రెస్​ క్యాండిడేట్​ను గతంలో ఎమ్మెల్యేగా చేసింది నేనే. నేను లేకుంటే ఆయనకు రాజకీయ భవిష్యత్​ లేదు' అంటూ వంశీని టార్గెట్​ చేస్తూ కామెంట్​ చేశారు. ఇందుకు ప్రతిగా వంశీ మాట్లాడుతూ ‘నన్ను నాన్ -లోకల్ అంటున్నారు కదా! మీరు ఏ స్థానికత ప్రాతిపదికన పాన్​గల్ నుంచి జడ్పీటీసీగా పోటీ చేశారు? నేనే పక్కా లోకల్. కల్వకుర్తి శేరిఅప్పరెడ్డిపల్లిలో పుట్టిన ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డను. నేను నాన్-లోకల్ అయితే గుజరాత్​కు చెందిన నరేంద్ర మోదీ వారణాసి నుంచి

హుజారాబాద్​కు చెందిన ఈటల రాజేందర్​ మల్కాజ్​గిరి నుంచి ఎలా పోటీ చేస్తారు? ఈ విషయంలో డీకే అరుణ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని ఆయన డిమాండ్​ చేశారు. వీరిద్దరి మధ్య ప్రతిరోజు మాటల యుద్ధం నడుస్తుండటంతో పాలమూరులో రాజకీయం వేడెక్కుతోంది.

కనిపించని బీఆర్ఎస్..​ 

పోలింగ్​కు ఇంకా 48 రోజుల గడువే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ, బీఆర్ఎస్​ నుంచి ఇంత వరకు ఆ పార్టీ క్యాండిడేట్, సిట్టింగ్​ ఎంపీ మన్నే శ్రీనివాస్​రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించలేదు. వాస్తవానికి ఈ స్థానం నుంచి ఈయన కాకుండా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు లీడర్లు పోటీ చేస్తారనే టాక్  నడిచింది. వీరిద్దరిలో ఎవరో ఒకరు​పోటీ చేయాలని హైకమాండ్​ సూచించినట్లు సమాచారం.

కానీ, వారు పోటీకి వెనకడుగు వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైకమాండ్​ తిరిగి సిట్టింగ్​ ఎంపీనే పార్టీ క్యాండిడేట్​గా ప్రకటించింది. అయితే, గతం నుంచి ఈయన పోటీకి సుముఖంగా లేరనే వార్తలు వస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సొంత పార్టీ లీడర్లే సపోర్ట్​ చేయకపోవడంతో, ఈయన నిరుత్సాహంలో ఉన్నట్లు అప్పట్లో పబ్లిక్​లో జోరుగా చర్చలు జరిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఈయనకు పోటీ చేసే ఆసక్తి లేకున్నా.. హైకమాండ్​ బలవంతంగా ఒప్పించిందనే టాక్​ నడుస్తోంది.

కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా..

పాలమూరు పార్లమెంట్​ పరిధిలో కాంగ్రెస్​ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డి, బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో రోజూ ఓటర్లను కలిసేలా షెడ్యూల్​ రూపొందించుకుంటున్నారు. కాంగ్రెస్  క్యాండిడేట్​ వంశీచంద్​రెడ్డి మార్నింగ్​ వాక్  పేరుతో ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డితో కలిసి పర్యటిస్తున్నారు.

యూత్​ ఓటర్లను కలిసి ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారనే దానిపై చర్చిస్తున్నారు. సీనియర్​ సిటిజన్లను పలుకరించి, వారితో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణ కూడా ప్రచారం షురూ చేశారు. క్రికెట్​ పోటీలకు చీఫ్​ గెస్ట్​గా హాజరై వారితో మాట్లాడుతున్నారు. ఉదయం, సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్లే గ్రౌండ్​లకు వెళ్లి మహిళలు, సీనియర్​ సిటిజన్లు, యూత్​తో మాట్లాడుతున్నారు.