పొత్తుపై తేల్చని కాంగ్రెస్​.. నారాజ్​లో కామ్రేడ్స్​

పొత్తుపై తేల్చని కాంగ్రెస్​.. నారాజ్​లో కామ్రేడ్స్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పొత్తుపై ఎటూ తేలడం లేదు. ఈ అంశంపై కాంగ్రెస్​ జాతీయ నేతలు తప్ప ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఎవ్వరూ నోరుమెదపడం లేదు. కనీసం చర్చలు కూడా జరపడం లేదు. దీంతో సీపీఎం, సీపీఐ లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి ముందే తేల్చాలని లెఫ్ట్​ పార్టీలు పట్టుబడుతున్నాయి. కానీ, ఇంకా చర్చలు కూడా మొదలు కాలేదు. లెఫ్ట్​ పార్టీలు అడుగుతున్న సీట్లలో పోటీకి కాంగ్రెస్​ లీడర్ల నుంచి కూడా భారీగా డిమాండ్​ ఉండడం పొత్తుల అంశాన్ని ముందుకు పడనివ్వడం లేదు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​తో పొత్తులేదని తేలడంతో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేయాలని యోచించాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్ రావ్ ఠాక్రే ఫోన్​చేసి కాంగ్రెస్​తో పొత్తులపై సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఏఐసీసీ ప్రతినిధి ఒకరు సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలతో విడివిడిగా రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము పోటీ చేయాలనుకుంటున్న సెగ్మెంట్ల వివరాలను లెఫ్ట్​ పార్టీలు అందజేశాయి. భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, మధిర, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లలో పోటీకి సీపీఎం.. కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి, దేవరకొండ స్థానాల్లో పోటీకి సీపీఐ లిస్టులను ఇచ్చాయి. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీకి ఆశావహుల నుంచి కాంగ్రెస్​ పార్టీ అప్లికేషన్లను తీసుకుంది. అయితే.. సీపీఎం, సీపీఐ అడుగుతున్న సీట్లలో కాంగ్రెస్​ తరఫున పోటీకి 94 మంది అప్లయ్​ చేసుకున్నారు. తమ పార్టీలోనే డిమాండ్​ ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్​ రాష్ట్ర నేతలు పొత్తులపై మౌనం దాల్చారు.

లెఫ్ట్ కోరుతున్న సీట్లలో కాంగ్రెస్​ నుంచి గట్టి పోటీ

సీపీఎం, సీపీఐ అడిగిన పది స్థానాల్లో ఏకంగా 94 మంది కాంగ్రెస్ ఆశావాహులు టికెట్​ కోసం అప్లై చేసుకున్నారు. సీపీఎం అడుగుతున్న స్థానాల్లో భద్రాచలం, మధిర రెండు కూడా కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లు కాగా.. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్​లో గత ఎన్నికల్లో స్పల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. పాలేరు స్థానంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్​లో చేరే అవకాశాలున్న షర్మిల, తుమ్మల కూడా పోటీకి సై అంటున్నారు. మిర్యాలగూడ టికెట్​కోసం జానారెడ్డి కుమారుడు అప్లై చేసుకున్నారు. సీపీఐ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లోనూ కాంగ్రెస్​ నుంచి గట్టి పోటీ ఉంది. హుస్నాబాద్​లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతుండగా.. మునుగోడు టికెట్  కోసం పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి పట్టుపడుతున్నారు. పాలేరు టికెట్​ తుమ్మలకు కేటాయిస్తే, కొత్తగూడెం టికెట్​ తనకు ఇవ్వాలని పొంగులేటి పట్టుపడుతున్నట్టు తెలిసింది. లెఫ్ట్​ పార్టీలు కోరుతున్న సీట్లలో సొంత పార్టీ నుంచే పోటీకి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పొత్తులపై కాంగ్రెస్​ రాష్ట్ర నేతలు ముందుకు రావడం లేదు.

ముందే తేల్చాలంటున్న కామ్రేడ్లు

తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలను గత నెలలోనే ఏఐసీసీ నేతకు తెలిపినప్పటికీ ఇప్పటికీ పొత్తులపై ఎటూ తేలకపోవడంతో లెఫ్ట్ పార్టీల నేతలు అసంతృప్తితో ఉన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ముందే తేల్చాలని వారు కోరుతున్నారు. అయితే.. కాంగ్రెస్​లోని ఇద్దరు కీలక నేతలు మాత్రం లెఫ్ట్​ పార్టీలతో పొత్తును వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే,  మూడ్రోజుల కింద సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరగ్గా.. దాంట్లో కాంగ్రెస్​తో పొత్తు అంశాన్ని జాతీయ నాయకత్వానికి అప్పగించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. సీట్లు, పొత్తుపై ఏదో ఒకటి తేల్చాలని నారాయణ కోరినట్టు తెలిసింది.