
- ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
- ఇయ్యాల నామినేషన్లు వేయనున్న నేతలు
- రెండు సీట్లూ కాంగ్రెస్‌కే దక్కే చాన్స్
- చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగింపు
- నాపై కుట్రలేం జరగలే.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై సస్పెన్స్వీడింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను అభ్యర్థులుగా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం వారిద్దరి పేర్లు ప్రకటించింది. నామినేషన్లకు గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకే టైమ్ ఉండడంతో వీళ్లిద్దరూ ఉదయమే నామినేషన్ వేస్తారని తెలుస్తున్నది. అభ్యర్థుల ప్రకటనపై చివరి వరకు హైడ్రామా నడిచింది. నిజానికి అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్లను పార్టీ దాదాపు ఖరారు చేసిందన్న టైమ్ లో అనూహ్యంగా బల్మూరి వెంకట్పేరు తెరపైకి వచ్చింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ల అభ్యర్థిత్వానికి హైకమాండ్ఓకే చెప్పింది.
అయితే దీనిపై కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అభ్యర్థుల ప్రకటన వాయిదా వేశారు. పలువురు మంత్రులు, సీనియర్‌నేతలు కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్మున్షీతో చర్చలు జరిపారు. ఆమె పార్టీ పెద్దలకు రిపోర్ట్పంపించారు. బుధవారం సాయంత్రం వరకు చర్చలు సాగించి, చివరకు అద్దంకి దయాకర్ స్థానంలో మహేశ్‌కుమార్ గౌడ్‌కు అవకాశం కల్పించారు. కాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉంది.
అభ్యర్థుల నేపథ్యమిదీ..
పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక సీనియర్‌గా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహేశ్‌కుమార్ గౌడ్సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనను ఎంపిక చేసినట్టు పేర్కొంటున్నాయి. మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా యూనిట్ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆయన.. 1990 నుంచి 1998 వరకు ఉమ్మడి ఏపీ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్‌గా పని చేశారు.
ఆ తర్వాత 1998 నుంచి 2000 వరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్‌కు సెక్రటరీగా, 2000 నుంచి 2003 వరకు పీసీసీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013 నుంచి 2014 వరకు ఏపీ స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఇక 1992 నవంబర్2న జన్మించిన బల్మూరి వెంకట్.. 31 ఏండ్ల వయసులోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. మెడిసిన్ చదివిన ఆయన.. విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇంటర్పేపర్ల వాల్యుయేషన్‌లో తప్పులు, టీఎస్పీఎస్సీ పేపర్లలీకులు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో అక్రమంగా అడ్మిషన్లు సహా అనేక విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాడారు. 80కి పైగా కేసులు ఎదుర్కొంటున్నారు. జైలుకు కూడా వెళ్లొచ్చారు. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
నాపై కుట్రలేవీ జరగలేదు: అద్దంకి
పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి దయాకర్అన్నారు. తనపై కుట్రలేవీ జరగలేదని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ పార్టీకి విధేయుడినేనని తెలిపారు. పార్టీ కోసం సహనంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తనకు మరింత మంచి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ఆలోచిస్తుండొచ్చని పేర్కొన్నారు. ‘‘నా విషయంలో హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం సానుకూల దృక్పథంతో ఉంది. దీపాదాస్మున్షీ కూడా పాజిటివ్‌గా ఉన్నారు” అని చెప్పారు.
నిరుద్యోగుల సమస్యలపై గళం విప్పుతా : బల్మూరి
అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా అవకాశం రావడం సంతోషంగా ఉందని బల్మూరి వెంకట్ అన్నారు. ఒకప్పుడు విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి వస్తుండేవాడినని.. ఇప్పుడు మండలిలోకి అడుగు పెడుతున్నానని చెప్పారు. తమ సమస్యలను వినేందుకు మొన్నటిదాకా ఎవరూ లేకుండేనని.. ఇప్పుడు విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై గళం విప్పుతానని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ప్రభుత్వం ఉన్నప్పుడు తాను లేవనెత్తిన డిమాండ్లు.. కాంగ్రెస్ప్రభుత్వంలో నెరవేరేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తనను ఎమ్మెల్సీగా చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
పని చేసినోళ్లకు గుర్తింపు : మహేశ్ కుమార్ గౌడ్
పార్టీ కోసం పని చేసినోళ్లకు గుర్తింపు ఉంటుందనడానికి తానే ఓ ఉదాహరణ అని మహేశ్కుమార్గౌడ్అన్నారు. బీసీలకు కాంగ్రెస్ లో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఆరు గ్యారంటీ స్కీములను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్పెద్దలకు కృతజ్ఞతలు. పదవి అనేది ఎంజాయ్మెంట్ కోసం కాదు.. అదొక బాధ్యత’’ అని పేర్కొన్నారు.