
న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వ్యవహారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. జాతీయ భద్రతను ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు. లడఖ్ పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది మోదీ చైనీస్ గ్యారెంటీ అంటూ ఎద్దేవా చేశారు. లడఖ్‌ను పరిరక్షించేందుకు, సరిహద్దుల్లో జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని ఖర్గే నొక్కి చెప్పారు. లడఖ్‌లోని గిరిజన సమూహాలకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రక్షణ కల్పించాలని ప్రజలనుంచి భారీ మద్దతు ఉన్నదని తెలిపారు. ‘మోదీ అన్ని హామీల్లాగానే లడఖ్ ప్రజలకు రాజ్యాంగ హక్కులు కల్పిస్తామనే హామీ కూడా ఓ భారీ ద్రోహంగా మిగిలిపోయింది.
ఈ హామీ నకిలీ.. చైనా మాల్లాంటిదే’ అని ఖర్గే ఎక్స్‌లో చురకలంటించారు. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. లడఖ్‌లోని పర్యావరణ సున్నితమైన హిమానీనదాలను దోపిడీచేసి, వారి క్రోనీ ఫ్రెండ్స్‌కు లబ్ధి చేకూర్చేందుకు మోదీ యత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ‘గల్వాన్ వ్యాలీలో 20 మంది సైనికుల ప్రాణత్యాగం తర్వాత కూడా మోదీ చైనాకు క్లీన్‌చీట్ ఇచ్చారు. అదే ఇప్పుడు మన సరిహద్దుల్లోకి చైనా విస్తరించేందుకు ప్రోత్సహించింది’ అని దుయ్యబట్టారు. దేప్పాంగ్ ప్లెయిన్స్, హాట్ స్పింగ్స్, గోగ్రా రీజియన్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించడాన్ని చైనా కొనసాగిస్తున్నదని తెలిపారు. ఇది మోదీ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.