మోదీ మళ్లీ వస్తే..రాజ్యాంగాన్ని రద్దు చేస్తడు : ఖర్గే

మోదీ మళ్లీ వస్తే..రాజ్యాంగాన్ని రద్దు చేస్తడు : ఖర్గే
  • దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతది: ఖర్గే

సాత్నా :  మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌లోని సాత్నాలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధార్థ్ కుష్వాహకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఈసారి అధికారంలోకి వచ్చారంటే అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆరోపించారు.

ఆ ఇద్దరు కలిసే ఇతర పార్టీల్లోని అవినీతి నేతలందరినీ బీజేపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ‘‘వాళ్లు ముందుగానే పెద్ద సైజ్ వాషింగ్ మెషీన్ ఏర్పాటు చేసుకున్నరు. అలా బీజేపీలో చేరంగనే అవినీతిపరులైన లీడర్లకు క్లీన్ చిట్ ఇస్తరు”అని ఖర్గే కామెంట్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బతికించుకోవాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఉద్యోగాల విప్లవం తెస్తం..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. మోదీ చెప్పినట్లుగా గాలి మాటలు చెప్పబోమన్నారు. కానీ, రైట్​టు అప్రెంటిస్​షిప్​ ద్వారా డిప్లొమా, డిగ్రీ చదివిన ప్రతిఒక్కరికి ఉద్యోగం దక్కేలా ఖాళీలను భర్తీ చేస్తామని ఖర్గే ఆదివారం ట్వీట్ చేశారు. యువ న్యాయ్ కింద ఉపాధి విప్లవాన్ని తీసుకొస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు ఫీజు రద్దు చేస్తామన్నారు. కాంపిటేటివ్ పరీక్షల పేపర్​లీక్​ల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. కరోనా టైంలో ఎగ్జామ్స్ రాయలేకపోయినోళ్లకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.

అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం సామాజిక భద్రతా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. స్టార్టప్స్ కోసం ఫండ్ పథకాన్ని ప్రారంభించి యువతకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేస్తామన్నారు. అగ్నిపథ్ స్కీమ్​ను నిలిపివేస్తామన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్స్​ను మిత్తీతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 21 ఏండ్లలోపు వయసు క్రీడాకారులకు నెలకు రూ.10 వేల చొప్పన స్కాలర్​షిప్ అందజేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు.