ధరణి సమస్యలను సెట్​ చేద్దాం.. రేవంత్ సర్కార్​ నిర్ణయం

ధరణి సమస్యలను  సెట్​ చేద్దాం..  రేవంత్  సర్కార్​ నిర్ణయం
  • పెండింగ్​లో రెండున్నర లక్షలకు పైగా అప్లికేషన్లు
  • వాటికి పరిష్కారం చూపనున్న ప్రభుత్వం
  • ఫీల్డ్​ విజిట్​ చేసి ప్రాబ్లమ్స్​ తెలుసుకోవాలని యోచన
  • సమస్యలపై చర్చించిన ధరణి కమిటీ
  • త్వరలో గవర్నమెంట్​కు పలు సిఫార్సులు
  • అటవీ, వక్ఫ్​, దేవాదాయ, సర్కార్​ భూములపైనా ఓ రిపోర్ట్​
  • ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశం

హైదరాబాద్, వెలుగు:  ధరణి సమస్యలను పరిష్కరించిన తర్వాతే ‘ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ చట్టం–2020’ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే దానిపైనా నిపుణుల నుంచి వివరాలు తెప్పించుకున్నది. టైటిల్​ గ్యారంటీ ఇచ్చేలా సమగ్ర రెవెన్యూ చట్టంగా ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మార్చాలని సర్కారు భావిస్తున్నది. అయితే ఈ చట్ట సవరణ కంటే ముందు లక్షల సంఖ్యలో ధరణిలో పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లను పరిష్కరించడంతో పాటు ఇప్పటికే ధరణిలో పలుమార్లు రిజెక్ట్​ అయిన భూసమస్యల అప్లికేషన్లను ఎలా క్లియర్​ చేయాలనే దానిపైనే ఫోకస్​ పెట్టింది. గ్రామం, మండలాల వారీగా ఎక్కడ .. ఏ రైతు.. ఏ సమస్య పై ధరణిలో అప్లై చేసుకున్నారో తెలుసుకుని, మండలాల వారీగా సమస్యలకు పరిష్కారం చూపాలని భావిస్తున్నది. అందులో భాగంగానే  ఏయే మాడ్యుల్స్​లో అప్లికేషన్లు రిజెక్ట్​ అవుతున్నాయి ? ఏ రకమైన భూ సమస్యలకు ధరణిలో మార్పు చేసేందుకు ఇబ్బంది అవుతున్నది? మ్యుటేషన్, సక్సెషన్​, భూ విస్తీర్ణంలో తక్కువ, ఎక్కువలు,  మిస్సింగ్ సర్వే నంబర్లు,  నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు ఏమున్నాయి?  వంటి వాటిపై ఫీల్డ్​ లెవెల్​లోకి వెళ్లి మరీ పరిష్కారాన్ని సులువు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నది. 


ధరణి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎలాంటి వివాదాలు లేకుండా భూమాత పోర్టల్​ను తీసుకువస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నది. ధరణి సమస్యలు, ధరణి పోర్టల్​ రీ కన్​స్ట్రక్షన్​​పై సీసీఎల్​ఏ నవీన్​ మిట్టల్ కన్వీనర్​గా సీఎంఆర్వో  పీడీ లచ్చిరెడ్డి, భూమి సునీల్, కోదండ రెడ్డి, మధుసూదన్​, రేమండ్​ పీటర్​తో ఏర్పాటైన కమిటీ గురువారం సెక్రటేరియెట్​లో సమావేశమైంది. సమస్యల పరిష్కారానికి ఏం చేయాలనే దానిపై చర్చించింది. ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందుల పరిష్కారం చూపడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ధరణిలో దాదాపు రెండున్నర లక్షల అప్లికేషన్లు ప్రాసెస్​లో ఉన్నాయి. ముందుగా వీటన్నింటికి పరిష్కారం ఎట్లా చూపించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. ధరణి పోర్టల్​లో ఎప్పటికప్పుడు మార్పులు చేసి అప్లికేషన్లకు అప్రూవల్​ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కమిటీ చర్చించింది.  ఎంతకీ తెగని భూముల పంచాయితీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా త్వరలోనే కమిటీ పలు సూచనలు చేయనుంది. కోర్టు కేసులకు ఎలాంటి సమస్యలు వెళ్తున్నాయనే దానిపైనా కమిటీ సమావేశంలో చర్చించారు. ధరణి సాఫ్ట్​వేర్​ ఏమిటి?  ధరణిలో ఇప్పటి వరకు జరిగిన మార్పులు, చేర్పులపైనా కమిటీ సమగ్రంగా రిపోర్ట్​ తెప్పించుకొని ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. 

ఆ భూములన్నింటిపైనా ఒక రిపోర్ట్​

ధరణి వచ్చిన తర్వాత అటు ఇటు అయిన ప్రభుత్వ భూములు, అసైన్డ్​ , భూదాన్​, అటవీ, వక్ఫ్​, దేవదాయ భూములపై కమిటీ దృష్టి సారించనుంది. అలా ఎన్ని భూములు పట్టాలుగా మారాయి ? ఎవరెవరికి దేని ప్రకారం చేశారనే దాన్ని కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్ట్​ ఇవ్వనుంది. అదే సమయంలో పట్టా భూములుగా ఉండాల్సిన రైతుల భూములు ఏవి తప్పుగా నమోదయ్యాయి ? నిషేధిత జాబితాలో ఏమున్నాయో వాటిపైనా దృష్టి పెట్టనుంది. ఫలితంగా పేద రైతులకు ఇబ్బందులు లేకుండా ధరణిలో సవరణలు చేపట్టనున్నారు. ఇక రిజిస్ట్రేషన్‌‌ యాక్ట్‌‌ ప్రకారం.. అమ్మడానికి వీల్లేని భూములను 22(ఏ) కింద నిషేధిత జాబితా(ప్రొహిబిషన్‌‌ ఆర్డర్‌‌ బుక్‌‌-పీవోబీ)లో పెట్టగా, అందులో పెట్టిన భూములు చాలా చోట్ల మాయమయ్యాయని,  రూ.వేల కోట్ల విలువైన భూకుంభకోణం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. ఇంకోవైపు కొత్తగా ఏర్పాటైన ధరణి కమిటీ ముందున్న ప్రధాన సమస్యల్లో నిషేధిత జాబితా భూములే కీలకంగా మారాయి. ధరణి రికార్డుల ప్రకారం నిషేధిత (22–ఏ) జాబితాలో చేరిన రైతుల పట్టా భూములను తిరిగి వారి పేరిట రికార్డు చేయడమే పెద్ద సవాల్‌‌గా మారనుంది.

పుట్టెడు సమస్యలున్నయ్​: కోదండరెడ్డి

ధరణిలో పుట్టెడు సమస్యలు ఉన్నాయని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. సెక్రటేరియెట్​లో కమిటీ భేటీ అనంతరం సభ్యులు లచ్చిరెడ్డి, భూమి సునీల్​ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వ్యవస్థతో లక్షల మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. అసైన్డ్​, ప్రభుత్వ, వక్ఫ్​ భూములు ఎట్లెట్లా ఉన్నాయి ? వాటి స్టేటస్​ ఏమిటనేది కూడా చూస్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ధరణిలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అన్నీ సవరించేలా మార్పులు చేస్తమన్నారు.  భూములన్నీ డిజిటలైజ్​ చేయాలని.. టైటిల్​ గ్యారంటీ ఉండాలనేది 2003లోనే  కాంగ్రెస్​ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.  ధరణితో రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుందని భూమి సునీల్​ అన్నారు. ఏ విధంగా కమిటీ రిపోర్ట్​ ఇవ్వాలనే దానిపై చర్చించినట్లు చెప్పారు.  సీసీఎల్​ఏ కేంద్రం ఈ కమిటీ సలహాలు సూచనలు స్వీకరిస్తుందని తెలిపారు. భూములకు సంబంధించి, ధరణికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంటామన్నారు. ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశమవుతుందని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా నివేదికలు ఇస్తామని ఆయన చెప్పారు. 

కోర్టుకు పోకుండా ఎలా పరిష్కరించాలి ?

ధరణిలోని భూములతో ముడిపడిన ఏ సమస్యనూ పరిష్కరించే అధికారం తహసీల్దార్‌‌, ఆర్డీవో, కలెక్టర్‌‌, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌‌కు లేకుండా ‘తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌‌పుస్తకం చట్టం-2020’ను అప్పట్లో తీసుకొచ్చారు. దీంతో రికార్డులతో ముడిపడిన ఏ సమస్యనైనా న్యాయస్థానంలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్ల కోర్టుల్లో ధరణి విషయంలో ఏకంగా రెండు లక్షలకు పైగా కేసులు పడ్డాయి. దీంతో కోర్టుకు వెళ్లకుండా.. నెలలు, ఏండ్ల తరబడి సమస్యను జటిలం చేయకుండా అప్పీల్స్​కు అవకాశం ఇచ్చేలా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.