బల్దియా ప్రక్షాళన!.. జీహెచ్ఎంసీపై సర్కార్ ఫోకస్

బల్దియా ప్రక్షాళన!.. జీహెచ్ఎంసీపై సర్కార్ ఫోకస్
  • ప్రభుత్వ ఆదేశాలతో ఫోకస్ పెట్టిన కమిషనర్  
  • ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు 
  • ఇప్పటికే పలువురు ఉద్యోగులపైన చర్యలు
  • తవ్విన కొద్దీ బయటపడుతున్న అధికారుల తప్పిదాలు
  • శానిటేషన్ నుంచి బర్త్, డెత్ విభాగాల వరకు ఇదే తీరు


హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ప్రక్షాళన చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో అన్నివిభాగాల్లో  గత 10 ఏండ్లుగా జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీసే పనిలో కమిషనర్ రోనాల్డ్ రాస్ నిమగ్నమయ్యారు. శానిటేషన్ నుంచి బర్త్ అండ్ డెత్ విభాగాల వరకు తవ్విన కొద్దీ అధికారుల అవినీతి, అక్రమాలు, తప్పిదాలు బయటపడుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బల్దియాలో రిటైర్డ్ అయి ఇంకా విధులు నిర్వహించే ఉద్యోగులను తొలగించింది. ఒకే చోట ఏండ్లుగా పనిచేసే వారిని బదిలీ చేసింది. ఇటీవల జరిగిన కౌన్సిల్ మీటింగ్ లోనూ అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పలువురు అధికారులు అక్రమంగా ఎలా సంపాదిస్తున్నారనే వివరాలను కూడా బహిర్గతం చేశారు. ఇందులో ప్రధానంగా స్వీపింగ్ మెషీన్ల బిల్లుల చెల్లింపులో భారీగా అవినీతి జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ విభాగంపై కమిషనర్ ఫోకస్ పెట్టి విచారణ కూడా చేస్తున్నారు. 

 హౌస్ కమిటీ వేసిన మేయర్ 

బల్దియాకు అడ్వటైజ్ మెంట్ ద్వారా రావాల్సిన ఆదాయానికి కొందరు అధికారులు గండి కొడుతున్నారనే  ఆరోపణలు వచ్చిన ఓ అధికారిపై బదిలీ వేటు కూడా వేశారు. పర్మిషన్లు లేకుండా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లతో పాటు అడ్వటైజ్ మెంట్ బోర్డులను కూడా తొలగించారు. ఇంకొన్నిచోట్ల తొలగిస్తూనే ఉన్నారు. ఇక బర్త్ అండ్ డెత్ ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించారు. బాధ్యుడైన ఓ అధికారిని సస్పెండ్ చేశారు. శానిటేషన్, అడ్వటైజ్ మెంట్ విభాగాల్లో జరిగిన అక్రమాలపై మేయర్ హౌస్ కమిటీ వేశారు. వారంలో కమిటీ విచారణ మొదలు పెట్టనుంది. ఇలా ఒక్కో విభాగంపై ఒక్కో విధంగా కమిషనర్ ఫోకస్ పెట్టారు.

 అధికారుల్లో టెన్షన్ 

గత సర్కార్ హయాంలో పాలకులను మెప్పించడం కోసమే అన్నట్లుగా బల్దియాలో కొందరు అధికారులు పని చేశారు.  సంబంధిత శాఖ మంత్రితోనే తమకు అవసరం ఉందనేలా వ్యవహరించారు. ఇంకొందరు అధికారులు ఏనాడైనా ప్రజలకు అందుబాటులో లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక పాలనలో మార్పు వచ్చింది. దీంతో అలాంటి అధికారుల్లో కూడా టెన్షన్  మొదలైంది. ఏండ్లుగా తిష్టవేసిన ఉద్యోగులను బదిలీ చేయడంతో మిగతా అధికారులకు వణుకు పట్టుకుంది.  ప్రస్తుతం ముగ్గురు, నలుగురు ఆఫీసర్లు కలిస్తే బల్దియాలో ఏం జరుగుతుందోననే దానిపైనే చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ వద్దే మున్సిపల్ శాఖ కూడా ఉండడంతో బల్దియాపై ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. 

 టౌన్ ప్లానింగ్ పై ఏక్షణమైనా... 

బల్దియాలోని కొన్ని విభాగాలపై ఏసీబీతోపాటు విజిలెన్స్ అధికారులు కూడా దృష్టి పెట్టినట్టు, ప్రధానంగా భవనాలకు పర్మిషన్లు  ఇచ్చే టౌన్ ప్లానింగ్ పై ఏసీబీ ఏక్షణమైన దాడులు చేసే చాన్స్ ఉంది.  మరోవైపు స్వీపింగ్, బర్త్ అండ్ డెత్ తదితర అక్రమాలపైనా విజిలెన్స్ దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో  గతంలోనే విజిలెన్స్ విచారణ జరిపి కమిషనర్ కు నివేదిక కూడా అందజేసింది. ఇప్పుడు కూడా విజిలెన్స్ విచారణ చేయించే అవకాశముంది. ఫేక్ సర్టిఫికెట్ల అక్రమాలు ఫలక్ నుమా సర్కిల్ లో మాత్రమే జరిగాయా? లేక చార్మినార్ జోన్ లో కూడా జరిగాయా...? అనే కోణంలో ముందస్తుగా అధికారులు విచారిస్తున్నారు. ఇందులో ఏమైనా అవకతవకలు  గుర్తిస్తే ఆ తర్వాత విజిలెన్స్ విచారణ చేయనుంది. ఇలా బల్దియాలోని అన్ని విభాగాలపై ఫోకస్ పెట్టి అక్రమాలు, అవినీతిని బయటకు తీస్తున్నారు.