
- గత బీఆర్ఎస్ సర్కారు ఇయ్యలే
- ఉమ్మడి జిల్లాకు రూ.104 కోట్లు
యాదాద్రి, నల్గొండ, వెలుగు : మహిళా సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి స్కీమ్ మహిళల పేరుతోనే అమలు చేస్తోంది. తాజాగా మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీ కూడా వారీ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
గత సర్కారు ఇవ్వలే..
ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వడ్డీలేని రుణం స్కీమ్ అమల్లోకి వచ్చింది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకునే సభ్యులకు ఇది వర్తించేది. తీసుకున్న రుణాలు, వడ్డీ సహా మెంబర్లు ప్రతినెలా చెల్లింపు చేసేవారు. అయితే చెల్లించిన వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేసేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019 వరకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ చెల్లించింది. ఆ తర్వాత వడ్డీ తిరిగి చెల్లింపును నిలిపివేసింది. దీంతో అప్పటి నుంచి మహిళా సంఘాలు చెల్లించిన వడ్డీ వారికి ఆగిపోయింది. ఈ కారణంగా సంఘాల్లోని మెంబర్లు చాలా మంది లోన్లు తీసుకోవడం మానేశారు.
ఐదేళ్ల తర్వాత..
ఎన్నికల ముందు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2023 నుంచి కాంగ్రెస్ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. దీంతో డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు ఉమ్మడి జిల్లాలోని వేలాది సంఘాలు చెల్లించిన వడ్డీని వారి అకౌంట్లలో వేసింది. రెండో విడతలో ఏప్రిల్ 2024 నుంచి ఆగస్టు 2024 వరకు అకౌంట్లలో వడ్డీ జమ చేసింది.
ఉమ్మడి జిల్లాకు రూ.104.97 కోట్లు..
ఉమ్మడి జిల్లాలోని మహిళా సంఘాలు చెల్లించిన వడ్డీ సొమ్ము రూ.104.97 కోట్లు అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది. జమ అయిన వడ్డీని ఆయా సంఘాలు డ్రా చేసుకుంటూ తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్నాయి.
తిరిగి వచ్చిన వడ్డీ వివరాలు..
యాదాద్రి జిల్లాలోని 11,209 సంఘాల అకౌంట్స్‌లోకి డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు రూ.10.60 కోట్లు జమ చేశారు. 12,246 సంఘాల అకౌంట్ లో ఏప్రిల్ 2024 నుంచి ఆగస్టు 2024 వరకు సంబంధించిన రూ.12.41 కోట్లు జమ చేశారు. సూర్యాపేట జిల్లాలోని 16,480 సంఘాల అకౌంట్స్‌లో రూ.49.50 కోట్లు జమ చేశారు. నల్గొండ జిల్లాలో 19,390 మహిళా సంఘాల అకౌంట్స్‌లో రూ.32.46 కోట్లు వడ్డీ జమ చేశారు.