ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై డైలమాలో కాంగ్రెస్​

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై డైలమాలో కాంగ్రెస్​
  • త్వరలో మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై పీసీసీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. శనివారం గాంధీభవన్ లో ఎన్నికల్లో పోటీపై పీసీసీ ఎన్నికల కమిటీ ఇన్ చార్జ్ మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. పార్టీ బలాబలాలపై చర్చించారు. అయితే ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదు. త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇంకొంత మంది నేతలతో చర్చించి అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మీటింగ్ తర్వాత దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై పార్టీ నేతలతో చర్చించామని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పై కూడా చర్చ జరిగిందని, ఇంకా కొంతమంది నేతల అభిప్రాయం సేకరించాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ నిర్ణయం హైకమాండ్​కు తెలిపి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై  ప్రకటిస్తామని వివరించారు. ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు తో ఓటర్ల ను  ప్రలోభపెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన లోకల్ బాడీ నేతలలో సగం మందిని అధికార పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు.