
- సలహాలిస్తే తీస్కుంటం.. దుష్ప్రచారం చేస్తే సహించం
- ప్రతిపక్షాలపై కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడ్తున్నాయని కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి అన్నారు. అపోజిషన్ లీడర్లు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని, అంతేగానీ.. ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తే సహించమని మండిపడ్డారు. బాధ్యతారహితంగా కామెంట్లు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు సన్న వడ్లు, దొడ్డు వడ్లు ఎంత మంది రైతులు పండిస్తారో కూడా బీఆర్ఎస్, బీజేపీ నేతలకు అవగాహన లేదన్నారు.
‘‘రాష్ట్రంలో ఈ ఏడాది సన్న వడ్లు 14 లక్షల ఎకరాల్లో, దొడ్డు వడ్లు 32 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. కేసీఆర్ మొదట సన్న వడ్లు వేయాలని అన్నరు. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అన్నరు.. కేంద్రం మెలిక పెట్టిందని తప్పించుకున్నరు. రాష్ట్రంలో సన్న వడ్లు పండించే అవకాశాలు ఉన్నా.. ఇతర రాష్ట్రాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. సన్న వడ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే మిల్లర్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దొడ్డు వడ్లు పండించే రైతులను ఆదుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. ప్రభుత్వం తప్పకుండా ఆ దిశగా ఆలోచన చేస్తది’’అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. వడ్లు అమ్ముకున్న రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు వస్తున్నాయన్నారు. తరుగు లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదు నుంచి పది కిలోల తరుగు తీశారని మండిపడ్డారు. మిల్లర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకున్నరని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలోనే రైతులకు మేలు జరుగుతున్నదన్నారు. తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు.