కేటీఆర్​కు పొన్నాల ప్రశ్న

కేటీఆర్​కు పొన్నాల ప్రశ్న

న్యూఢిల్లీ, వెలుగు: ఇన్​ఫర్మేషన్​ టెక్నాలజీ ఇన్వెస్ట్​మెంట్​ రీజియన్​ (ఐటీఐఆర్) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని దోషిగా చూపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అసలు.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీఐఆర్​ అంటే ఏంటో తెలుసా? పూర్తి అవగాహన ఉందా? అని పొన్నాల ప్రశ్నించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాద్ లోనే మొదటిది కావాలని అప్పటి కేంద్రాన్ని ఒప్పించి ప్రణాళిక ముందు ఉంచామన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ను నీరు గార్చిందని విమర్శించారు. కేంద్రం నిధులివ్వడం లేదని ఉద్యోగ కల్పన మానేస్తారా? అని నిలదీశారు. ఈ ప్రాజెక్టుతో 25 ఏండ్లలో 15.50 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 55 లక్షల మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుందన్నారు. 3 లక్షల కోట్ల ఐటీ పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. 8ఏండ్లలో ఏడాదికి రూ.2 వేల కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తే అయిపోయేదని పొన్నాల అన్నారు.