లడఖ్ ప్రజలు ఆందోళనలో ఉన్నరు: రాహుల్

లడఖ్ ప్రజలు ఆందోళనలో ఉన్నరు: రాహుల్

లేహ్: లడఖ్ లో మన భూమిని చైనా ఆక్రమించుకుందని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా ఒక్క ఇంచు కూడా ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిన దాంట్లో నిజం లేదన్నారు. శనివారం లేహ్ నుంచి పాంగాంగ్ లేక్ కు బైక్ పై వెళ్లిన రాహుల్.. ఆదివారం అక్కడ తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘చైనా ఆర్మీ తమ బీడు భూములను ఆక్రమించుకుందని లడఖ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము ఇప్పుడు అక్కడికి పశువులను మేతకు తీసుకెళ్లలేకపోతున్నామని వాళ్లు ఆవేదన చెందుతున్నారు. 

ఒక్క ఇంచు భూమి కూడా చైనా ఆక్రమించుకోలేదని ప్రధాని మోదీ చెబుతుండగా, చైనా మన భూమిని ఆక్రమించుకుందని లడఖ్ ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. కావాలంటే ఈ ప్రాంతంలో ఎవరినైనా అడగండి.. ఈ విషయాన్ని చెబుతారు” అని ఆయన అన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా రావడం లేదని లడఖ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ‘‘భారత్ జోడో యాత్ర టైమ్ లోనే లడఖ్ రావాలని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. అందుకే ఇప్పుడు వాళ్ల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. నుబ్రా, కార్గిల్ కు కూడా వెళ్తాను” అని తెలిపారు. 

కాగా, తూర్పు లడఖ్ లో చైనాతో బార్డర్ వివాదం నెలకొంది. మూడేండ్ల కింద పాంగాంగ్ లేక్, గల్వాన్ లోయలో రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పటి నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు వైపులా మిలటరీ చర్చలతో పరిస్థితులు కొంత కుదుటపడ్డాయి. కాగా, రాహుల్ కామెంట్లను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన చైనా ప్రచారకర్తగా మారిపోయారని విమర్శించింది. దేశప్రతిష్టను రాహుల్ దెబ్బతీస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి 
రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.