ప్రజల కోసం పోరాడ్త.. వెనక్కి తగ్గేది లేదు: సచిన్ పైలట్

ప్రజల కోసం పోరాడ్త..  వెనక్కి తగ్గేది లేదు: సచిన్ పైలట్

దౌసా: ప్రజలకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగిస్తానని కాంగ్రెస్ అసంతృప్త నేత సచిన్ పైలట్ తెలిపారు. తన డిమాండ్లపై వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పారు. ఇయ్యాల కాకపోతే రేపు అయినా న్యాయం జరుగుతుందని అన్నారు. ఆదివారం తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్భంగా ఆయనకు సచిన్ పైలట్ నివాళులర్పించారు. రాజస్థాన్​లోని దౌసా జిల్లాలో ఏర్పాటు చేసిన తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్ పైలట్ మాట్లాడారు. ‘‘మనం ఏ పదవిలో ఉన్నా లేకపోయినా.. 

మనం ఏం చెబుతున్నాం? ఏం చేస్తున్నాం? అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. నా వరకు ప్రజల నమ్మకమే నాకు పెద్ద ఆస్తి. వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే ఆ నమ్మకం నిలబడుతుంది. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ తగ్గనివ్వను. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను. ఇంతకుముందు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఇకపైనా తగ్గను” అని ఆయన తెలిపారు. ‘‘ఎవరి సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. ఉమ్మడి ప్రయోజనం ఒక్కటే కావాలి. భయపడకుండా మాట్లాడగలిగే, నీతి నిజాయతీకి మద్దతు తెలిపే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాంప్రమైజ్ కాని వాళ్లే ఇప్పుడు దేశానికి కావాలి” అని అన్నారు. కాగా, పైలట్ కొత్త పార్టీ పెడతారని, తన తండ్రి వర్ధంతి రోజు ప్రకటన చేస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరిగింది. కానీ పైలట్ మాత్రం సొంత పార్టీ ప్రస్తావనే తేలేదు.