తెరపైకి బీసీ నినాదం.. 53 శాతం మంది బీసీ ఓటర్లే

తెరపైకి బీసీ నినాదం..  53 శాతం మంది బీసీ ఓటర్లే
  • మెజార్టీ స్థానాలు కేటాయించాలని డిమాండ్
  • బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల నుంచి నాలుగైదు స్థానాలు కేటాయించే చాన్స్​

మహబూబ్​నగర్, వెలుగు: అసెంబ్లీ ఎలక్షన్లలో బీసీ లీడర్లకు మెజార్టీ సీట్లు ఇవ్వాలనే డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. ఎక్కువ బీసీ జనాభా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో సగానికిపైగా స్థానాలను బీసీలకు కేటాయించాలని ప్రధాన పార్టీల్లోని ఆ సామాజిక వర్గ లీడర్లు కోరుతున్నారు. ఈ మేరకు హైకమాండ్​ వద్ద తమ గళాన్ని వినిపిస్తున్నారు. దీనికితోడు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయా వర్గాలు కూడా ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని బీసీలకే సపోర్ట్​ చేయాలనే స్లోగన్​ తెరమీదకు తెస్తున్నారు.

53 శాతం బీసీ ఓటర్లే..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇటీవల ఎలక్షన్​ కమిషన్​ రిలీజ్ చేసిన​ ఓటరు తుది జాబితాలో 32,81,593 ఓటర్లున్నారు. ఇందులో 53 శాతం మంది బీసీ ఓటర్లే ఉన్నారు. 14 అసెంబ్లీ స్థానాల్లో అచ్చంపేట, అలంపూర్​ ఎస్సీకి రిజర్వ్​ కాగా, మిగతా నియోజకవర్గాలు జనరల్​కు కేటాయించారు. అయితే మహబూబ్​నగర్, గద్వాల, జడ్చర్ల, నారాయణపేట, మక్తల్, షాద్​నగర్​, దేవరకద్ర, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మెజార్టీ జనాభా బీసీలే ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములు ఈ సామాజిక వర్గం ఓటర్ల మీదనే ఆధారపడి ఉండడంతో, ప్రస్తుతం ఈ సామాజిక వర్గం లీడర్లకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దీనికితోడు రాష్ట్రంలో బీసీ గణన చేపట్టాలనే డిమాండ్, బీసీ లీడర్లకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయారిటీ ఇవ్వాలని ప్రధాన పార్టీల హైకమాండ్ల వద్దకు వినతులు వెల్లువెత్తుతున్నాయి.

ALSO READ : కడెం ప్రాజెక్టు ఖాళీ!.. 20 రోజులుగా 15వ గేటు ఖుల్లా

బీఆర్ఎస్​లో ముగ్గురికే చాన్స్​..

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్​ ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించింది. షాద్​నగర్​ నుంచి అంజయ్య యాదవ్, కల్వకుర్తి నుంచి జైపాల్​ యాదవ్, మహబూబ్​నగర్​ నుంచి వి.శ్రీనివాస్​గౌడ్​లకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మూడు నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో బీసీలకు అవకాశం ఇవ్వలేదు. ​కాంగ్రెస్​ పార్టీ ఈ ఎన్నికల్లో అత్యధికంగా బీసీలకే ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆ పార్టీ నేషనల్​ లీడర్​ రాహుల్​ గాంధీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడంతో హైకమాండ్​ షాద్​నగర్, మక్తల్, మహబూబ్​నగర్, నారాయణపేట, గద్వాల, దేవరకద్ర అసెంబ్లీ స్థానాల్లో బీసీ లీడర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కనీసం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీసీ లీడర్లను దింపడం పక్కా అనే సమాచారం ఉంది. బీజేపీ సైతం బీసీ నినాదాన్ని అందింపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. 

సమ్మేళనాలు.. సమావేశాలు..

ప్రధాన పార్టీల నుంచి బీసీ లీడర్లకు టికెట్లు ఇవ్వాలని బీసీ సామాజిక వర్గాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈ సామాజిక వర్గంలోని పలు వర్గాల వారు ఇటీవల రహస్యంగా ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బీసీ లీడర్లనే గెలిపించుకోవాలని తీర్మానం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీసీ లీడర్లు కూడా ఇటీవల బీజేపీ, కాంగ్రెస్​ హైకమాండ్​ వద్ద నియోజకవర్గాల్లో తమ సామాజిక వర్గం వారే ఎక్కువగా ఉన్నారని, తమకే టికెట్లు ఇవ్వాలనే అభ్యర్థిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీలు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏఏ నియోజకవర్గాల నుంచి బీసీ లీడర్లకు రంగంలోకి దింపాలి? బీసీ లీడర్లకు రంగంలోకి దింపడం వల్ల గెలుపోటములపై ప్రభావం ఉంటుందా? తదితర విషయాలపై సర్వేలు నిర్వహిస్తోంది. ఈ రిపోర్టులు రాగానే క్యాండిడేట్లను ఫైనల్​ చేసే అవకాశాలున్నాయనే టాక్​ వినిపిస్తోంది.