గాంధీ భవన్లో నేతల వాస్తు సెంటిమెంట్

గాంధీ భవన్లో నేతల వాస్తు సెంటిమెంట్

గాంధీ భవన్ సెంటిమెంట్ కు కేరాఫ్ గా మారింది. పార్టీ నేతలు వాస్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వాస్తు మార్పులు చేసిన నేతల సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందని చర్చ జరుగుతోంది. కార్యాలయంలోని లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్ కేటాయించాలని నేతల నుంచి ఫుల్ డిమాండ్ వస్తోంది. 

 రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ లో వాస్తులో మార్పులు చేర్పులు వర్క్ అవుట్ అయ్యాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. పీసీసీ చీఫ్ నుంచి కింది స్థాయి నేతల వరకు అంతా వాస్తు సెంటిమెంట్ ను బలంగా నమ్ముతున్నారు. మూడేళ్ళ క్రితం పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం జరిగింది. రేవంత్ తనకు అనుకూలంగా గాంధీ భవన్ లో వాస్తుకు సంబంధించిన మార్పులు చేయించారు. దీంతో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో పాటు... రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కింది. దీంతో మిగతా నేతలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

 మిగతా నేతలకు కూడా వాస్తు కలిసొచ్చి పదవులు దక్కాయి అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఐతే పదవులు దక్కించుకున్న నేతలంతా లెఫ్ట్ సైడ్ చాంబర్లు ఉన్న వారే కావడం చర్చనీయంగా మారింది. గాంధీభవన్ లోకి ఎంట్రీ కాగానే CPRO రూమ్ నుంచి AICC ఛాంబర్ కు వెళ్లే మార్గంలో లెఫ్ట్ సైడ్ ఉండే చాంబర్లు లక్కీ ఛాంబర్లుగా భావిస్తున్నారు నేతలు. లెఫ్ట్ సైడ్ ఛాంబర్ లో కూర్చున్న నేతలంతా ప్రభుత్వంలో వివిధ పదవులను దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ ఛాంబర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. మిగతా నేతలు కూడా అవే ఛాంబర్లు కావాలని కోరుతున్నారు.

 PCC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మల్లు రవి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడగానే ఢిల్లీలో అధికార ప్రతినిధి పోస్ట్ దక్కించుకున్నారు. తర్వాత నాగర్ కర్నూల్ MP గా పోటీ చేసి గెలిచారు. అదే రూమ్ లో వుండే.. ప్రోటోకాల్ చైర్మన్, హర్కర వేణుగోపాల్ కు ప్రభుత్వ అడ్వైజరీ పోస్టు దక్కింది. PCC వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముందుగా మీడియా వ్యవహారాల చైర్మన్ గా వున్నారు. తాజాగా ఆయన భువనగిరి ఎంపీ టికెట్ దక్కించుకొని భారీ మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం సామ రామ్మోహన్ రెడ్డి  పీసీసీ మీడియా చైర్మన్ పదవిలో ఉన్నారు. త్వరలో సామకు కూడా... స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది.

 లెఫ్ట్ సైడ్ లో వుండే మరికొన్ని చాంబర్లు నేతలకు బాగా కలిసొచ్చాయి. పవన్ మల్లాది పార్టీ కార్యకర్తల ఇన్సూరెన్స్ వింగ్ చూస్తున్నారు. మొన్నటి వరకు వార్ రూమ్ ఇంఛార్జిగా ఉన్నారు. త్వరలోనే పవన్ కు మంచి పోస్ట్ రానున్నట్లు పార్టీలో టాక్. అదే వరుసలో PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఉంది. ఆయనకు  MLC పదవి వరించింది. ఫస్ట్ ఫ్లోర్ లో లెఫ్ట్ సైడ్ చాంబర్ల నేతలకు బాగా కలిసి వచ్చింది. ఫిషర్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మెట్టు సాయి కుమార్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ చైర్మన్ గా మన్నె సతీష్, SC కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం, ST కార్పొరేషన్ చైర్మన్ గా బెల్లయ్య నాయక్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతి శ్రీకాంత్, వికలాంగులు కార్పొరేషన్ చైర్మన్ గా వీరయ్య, సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి కి పదవులు వరించాయి

 గాంధీభవన్ లో లెఫ్ట్ సైడ్ ఛాంబర్లలో కూర్చున్న నేతలకు పదవులు దక్కడంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రైట్ సైడ్ లో కూర్చున్న నేతలకు ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పదవులు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఒక్కరిద్దరికి వచ్చినా.. వారు మాత్రం ఆ ఛాంబర్ లో ఒక్కరోజు కూడా కూర్చోలేదనే టాక్ ఉంది. వాస్తుపై నమ్మకం ఉన్న నేతలు పార్టీ కార్యాలయంలోని లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఛాంబర్స్ కావాలని కోరుకుంటున్నారు.