మరో నాలుగు సీట్లకు..కాంగ్రెస్​ అభ్యర్థులు ఖరారు

మరో నాలుగు సీట్లకు..కాంగ్రెస్​ అభ్యర్థులు ఖరారు
  • ఆదిలాబాద్-- ఆత్రం సుగుణ, నిజామాబాద్- టీ జీవన్ రెడ్డి 
  • భువనగిరి-చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు
  • పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ
  • హాజరైన సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్​
  • మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చ

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలోని నాలుగు లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ –టీ  జీవన్ రెడ్డి, భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి -నీలం మధుకు అవకాశం కల్పించింది. మిగతా 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 31 న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.

బుధవారం ఏఐసీసీ హెడ్ ఆఫీసులో పార్టీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో  కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ జరిగింది. సీఈసీ సభ్యులుగా సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరుకాగా... తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దీపా దాస్ మున్షీ, సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 

తెలంగాణకు సంబంధించి మిగిలిన 8 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేవలం 15 నిమిషాలు మాత్రమే కసరత్తు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం అందించిన అభ్యర్థుల లిస్ట్ పై ఖర్గే, సోనియా, ఇతర నేతలు చర్చించారు. ఆ లిస్ట్ ఆధారంగా సామాజిక సమతుల్యం, గెలుపోటములు, సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలపై సవివరంగా ఆరా తీశారు. అయితే, ఎనిమిదిలో కేవలం నాలుగు స్థానాలపై మాత్రమే నేతల మధ్య అంగీకారం కుదిరింది. మిగిలిన నాలుగు స్థానాలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది.

కొన్ని స్థానాలకు సంబంధించి ఇన్​చార్జి దీపా మున్షి, సీఎం రేవంత్ ఒకరి పేరు ప్రస్తావించగా.. డిప్యూటీ, ఉత్తమ్ మరొకరి పేరును తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. ఎవరి వర్గానికి వారు మద్దతుగా నిలవడంతో.. 4 స్థానాలపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, కాంగ్రెస్ రిలీజ్ చేసిన జాబితాలో ఆదిలాబాద్ (ఎస్టీ రిజర్వ్​డ్​) స్థానానికి ఎస్సీ వర్గానికి చెందిన సుగుణ కుమారి చెలిమల పేరు ప్రస్తావించింది. దీనిపై ఆరా తీయగా.. ఆత్రం సుగుణకు బదులు, సుగుణ కుమారి చెలిమల పేరును వెల్లడించినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా, 8 వ లిస్ట్ లో దేశవ్యాప్తంగా తెలంగాణ (4), యూపీ (4), మధ్యప్రదేశ్ (3), జార్ఖండ్ (3)స్థానాలు.. మొత్తం  14 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది.  

ఖర్గే, సోనియాతో సీఎం రేవంత్​ భేటీ!

సీఈసీ భేటీ అనంతరం రాష్ట్ర నేతలతో అధిష్టాన పెద్దలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మీటింగ్ లో భిన్నాభిప్రాయాలు రావడంతో సీఎం, డిప్యూటీ సీఎం, ఉత్తమ్ తో విడివిడిగా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం గోవా, జార్ఖండ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ కు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై సీఈసీ భేటీ జరిగింది. మీటింగ్​ పూర్తయ్యాక తెలంగాణకు సంబంధించిన నేతలు.. ఖర్గే, సోనియాతో సమావేశం అయ్యారు.

దాదాపు 40 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో అధిష్టానం.. నేతల్ని బుజ్జగించినట్టు తెలిసింది. తొలుత డిప్యూటీ సీఎం భట్టి మీటింగ్ నుంచి బయటకు రాగా.. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాసేపటికి బయటకు వచ్చిన ఉత్తమ్ ను అప్ డేట్ కోరగా.. అథరైజ్జ్ పర్సన్స్ మాత్రమే మాట్లాడుతారంటూ వెళ్లిపోయారు. ఇక ఏఐసీసీ ఆఫీస్ నుంచి సోనియాగాంధీ వెళ్లిన తర్వాత కూడా సీఎం రేవంత్ అక్కడే ఉన్నారు. కాసేపు ఆగి పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం మంతనాలు జరిపారు. ఫైనల్ గా రాత్రి 8:20 గంటలకు ఏఐసీసీ నుంచి బయలు దేరి నేరుగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. 

సీఎం ను కలిసిన ఆశావహులు

సీఈసీ మీటింగ్ కు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ఆశావహులు కలిశారు. యమునా బ్లాక్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ని మంత్రి పొంగులేటి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత పున్న కైలాశ్​నేతతో పాటు పలువురు కలిశారు. ఖమ్మం సీటు తన సోదరుడికి కేటాయించాలని మంత్రి పొంగులేటి, భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్న కైలాశ్​నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆదిలాబాద్ సీటు కోసం నరేశ్ జాదవ్ ఇటు సీఎం నివాసం, ఏఐసీసీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తనకు సీటు దక్కకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని నరేశ్​ జాదవ్​ మీడియాకు తెలిపారు. 

ఆ స్థానాలు నెక్ట్ మీటింగ్​లో ఫైనల్ 

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా.. తాజాగా నలుగురి పేర్ల ప్రకటనతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 13కు చేరింది. ఇందులో ఫస్ట్ లిస్ట్ లో 4, సెకండ్ లిస్ట్ లో 5, తాజా లిస్ట్ లో నాలుగు స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మిగిలిన ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు  ఎంపిక చేయాల్సి ఉన్నది. ఈ నెల 31 న జరిగే సీఈసీ మీటింగ్ లో ఈ స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేయనున్నది. 

హాట్ సీట్ గా ఖమ్మం 

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో కాంగ్రెస్ కంచుకోటగా కనిపిస్తున్న ఖమ్మం సీటు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఖమ్మం అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి తన సోదరుడు ప్రసాద్‌‌ రెడ్డి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకరు పార్టీ సీనియర్ నేత, మరొకరు రాష్ట్రంలో అధికారం తేవడంలో ఖమ్మం నుంచి ఎక్కువ స్థానాలు గెలిపించిన వ్యక్తి... ఈ రెండింటి మధ్య ఈ స్థానాన్ని ఎవరికి కేటాయించాలన్న అంశంపై హైకమాండ్ సైతం మల్లగుల్లాలు పడుతున్నది.

అలాగే, వరంగల్‌‌ టికెట్‌‌ కోసం దమ్మాటి సాంబయ్యతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పసునూరి దయాకర్ పోటీ పడుతున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనకంటే బలమైన అభ్యర్థి కోసం రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం పదిలంగా ఉండాలంటే ఎంఐఎం సపోర్ట్ అవసరమని భావిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్ స్థానం నుంచి బరిలో నిలిపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తున్నది.