కాంగ్రెస్ మేనిఫెస్టో : రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. మహిళలకు ఏడాదికి రూ.10వేలు

కాంగ్రెస్  మేనిఫెస్టో  :  రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. మహిళలకు ఏడాదికి రూ.10వేలు

రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది.  జైపుర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా మేనిఫెస్టోలో మరికొన్ని హామీలను ఇచ్చింది.  మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని హామీ ఇచ్చింది.  స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని, రైతులకు  రూ. 2 లక్షల వడ్డీ లేని రుణాలు  ఇస్తామని  ప్రకటించింది.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:

  • 4 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం 
  • మహిళలకు ఏడాదికి రూ.10వేల నగదు 
  • రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌
  • ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు
  • చిరంజీవి మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకం రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు
  • చిరు వ్యాపారులు, దుకాణదారులకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 

200 నియోజకవర్గాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి  నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.  భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.