
- లక్ష మందితో నిర్వహిస్తం: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
- లోకల్‌బాడీ ఎన్నికలకు గడువు పొడిగించాలని కోర్టును కోరుతం
- బీసీ రిజర్వేషన్లుప్రకటించాకే నిర్వహిస్తం
- త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
- వారం, పది రోజుల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలు
- కవితను కాంగ్రెస్‌లోకి తీసుకునే ప్రసక్తే లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డిలో ఈ నెల15న పీసీసీ ఆధ్వర్యంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోనే ముందుకెళ్తామని, ఎమ్మెల్యేలు కోరుకుంటే మళ్లీ ఆయనే సీఎం అవుతారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని వెళ్తున్నామని, క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని చెప్పారు. శుక్రవారం మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, లోకల్ బాడీ ఎన్నికలకు గడువు పొడిగించాలని కోర్డును కోరుతామని చెప్పారు. రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించామని, ప్రజాకోణంలో చూసి ఈ బిల్లులను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయమని, అందుకే బీసీ రిజర్వేషన్ల కోసం చట్టాలు చేశామని, ఇది తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అధికారంలో ఉండి పాదయాత్ర చేపట్టానని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. సీఎం, మంత్రులు, పార్టీ నాయకులు అందరూ తనకు మద్దతు ఇచ్చారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు.
త్వరలో కమిటీలు
పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలను త్వరలో ప్రకటించబోతున్నామని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. వారం, పది రోజుల్లో అన్ని కమిటీలు పూర్తి చేస్తామని ప్రకటించారు. పనిచేసేవారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, కార్యకర్తలు ఆదిశగా పనిచేయాలని సూచించారు. లోకల్ బాడీ కంటే ముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాల్లో చేతివాటం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరు ప్రకటించడం కేబినెట్ నిర్ణయమని పేర్కొన్నారు.
కవితను కాంగ్రెస్‌లోకి తీసుకునే ప్రసక్తే లేదు..
ఫ్లైట్ లో ఎవరైనా ప్రయాణిస్తారని, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఒకే ఫ్లైట్‌లో పోయారనేది అవాస్తవమని మహేశ్‌గౌడ్ తెలిపారు. ‘‘నేను, కవిత కూడా చాలాసార్లు ఒకే ఫ్లైట్‌లో వెళ్లాం. అయినంత మాత్రాన ములాఖత్ అయినట్టా?’’ అని ప్రశ్నించారు. కవిత కాంగ్రెస్‌లోకి వస్తదని అనుకోవట్లేదని, ఆమెను పార్టీలోకి తీసుకోవాల్సి అవసరం కూడా లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము లాంటిందని, ఆ పార్టీలో కుటుంబ తగాదాలు జరుగుతున్నాయని చెప్పారు. హరీశ్‌రావు, సంతోష్‌రావు అవినీతిని కవిత బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరంలో కరప్షన్ జరిగింది నిజమేనని కవిత ఒప్పుకున్నదని తెలిపారు. నేరెళ్ల బాధితుల పరామర్శకు ఏఐసీసీ చీఫ్ వెళ్తే రానివ్వలేదని, ఈ ఘటనపై ఆ రోజే కవిత మాట్లాడితే ఆమెకు సెల్యూట్ చేసేవాడినని పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటున్నారని, అందుకే సీబీఐకి అప్పగించామని తెలిపారు. ఈ విషయంలో సీబీఐ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అనుకుంటున్నామన్నారు.
రాజగోపాల్ రెడ్డి విషయాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నది
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవమేనని, ఆయన విషయాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నదని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ముక్కు సూటిగా మాట్లాడుతారన్నారని చెప్పారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను యూనిట్‌గా చూడలేమని, రాష్ట్ర యూనిట్‌గానే పరిగణిస్తామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ ఓటర్లను మాయ చేసిండని దుయ్యబట్టారు. తెలంగాణకు ఇవ్వాల్సిన యూరియా వాటా కేంద్రం ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దేశవాప్తంగా యూరియా కొరత ఉన్నదని, కేంద్రం యూరియా ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. యూరియా కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.