మంత్రి మల్లారెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలను జనం నమ్మరు: వజ్రేశ్ యాదవ్

మంత్రి మల్లారెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలను జనం నమ్మరు: వజ్రేశ్ యాదవ్

మేడిపల్లి, వెలుగు: మంత్రి మల్లారెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరని మేడ్చల్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ ​యాదవ్ తెలిపారు. కాంగ్రెస్​ను గెలిపిస్తే మేడ్చల్ సెగ్మెంట్​లో ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధి మేడిపల్లి, పర్వతాపూర్​లోని పలు కాలనీల్లో పోగుల నర్సింహా రెడ్డి, తుంగతుర్తి రవితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ  సందర్భంగా వజ్రేశ్​ యాదవ్ మాట్లాడుతూ.. పీర్జాదిగూడలో చిన్న వానకే ఇండ్లలోకి నీరు చేరుతుందని.. జనం ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.  పీర్జాదిగూడ, బోడుప్పల్​లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయన్నారు.

స్థానికంగా పుట్టి పెరిగిన వ్యక్తిగా ఇక్కడి సమస్యలు తనకు తెలుసన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాని ఆయన కోరారు. అనంతరం బోడుప్పల్​లోని కుతుబ్ షాహీ మసీదు వద్ద ముస్లిం మత పెద్దలతో కలిసి వజ్రేశ్​యాదవ్ ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో బోడుప్పల్ మాజీ సర్పంచ్ తోటకూర లక్ష్మీ, సీనియర్ నాయకులు కొత్త కిశోర్ గౌడ్, పీర్జాదిగూడ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, తోటకూర రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.