కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తది : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తది : జీవన్ రెడ్డి

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 6 నుండి హాథ్ సే హాథ్ జోడో ప్రారంభమవుతుందని.. గడపగడపకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని.. విద్యార్థుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని విమర్శించారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా కేజీ టు పీజీ ఉచిత విద్య సామాన్యులకు అందుబాటులోకి రాలేదన్నారు.

ప్రభుత్వం ప్రకటనలకు చేస్తున్న ఖర్చును పాఠశాల నిర్వాహణకు వెచ్చించాలని జీవన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పోకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినా.. బోధన సిబ్బంది నియామకం చేపట్టలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన పేరిట మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులు రద్దుచేసి సుమారు 600 కోట్లు మన ఊరు మనబడి పథకానికి మళ్ళించారని ఆరోపించారు.