బీసీ రిజర్వేషన్లపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు..కవితకు కాంగ్రెస్‌ ఎంపీ చామల సూచన 

బీసీ రిజర్వేషన్లపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు..కవితకు కాంగ్రెస్‌ ఎంపీ చామల సూచన 

న్యూఢిల్లీ, వెలుగు: బీసీల రిజర్వేషన్లపై పోరాటం చేసే సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మానుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్‌‌ రెడ్డి అన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే రిజర్వేషన్లపై ఈ నెల 4 నుంచి 25 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో యుద్ధం చేయబోతోందని చెప్పారు. ఈ విషయంలో కవిత 72 గంటల దీక్ష మానుకోని, వేరే మంచి విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓబీసీలు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కవిత చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామన్నారు.

ముస్లిం రిజర్వేషన్లు అంటూ బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సమాధానమిచ్చారని గుర్తుచేశారు. వెనుకబడిన వర్గాలను గుర్తించి 42 శాతం రిజర్వేషన్లు క్రోడీకరించామని, ఇందులో ముస్లింలలో వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయని వెల్లడించారు. రిజర్వేషన్లపై  కేంద్రంతో తేల్చుకునేందుకు.. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వస్తున్నారని చెప్పారు. బీసీ బిల్లును ఆమోదించాలని ఈ నెల 7న రాష్ట్రపతి అపాయింట్ మెంట్  కోరుతున్నట్లు చెప్పారు.