
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రసంగంపై రాజ్యసభలో రగడ చోటు చేసుకుంది. వెనకబడిన కులాలకు చెందిన మహిళలపై ఖర్గే చేసిన ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు తప్పుపట్టారు. పదే పదే ఖర్గే ప్రసంగానికి అడ్డు తగిలారు బీజేపీ సభ్యులు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిందని గుర్తు చేశారు ఖర్గే. మహిళా బిల్లు క్రెడిట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు (కాంగ్రెస్ పార్టీకి) ఇవ్వదలుచుకోలేదన్నారు. మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లు చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఖర్గే.
మహిళా రిజర్వేషన్లలో మూడో వంతు వెనుకబడిన కులాల మహిళలకు ఇవ్వాలని పట్టుబట్టారు ఖర్గే. అయితే.. వెనకబడిన కులాల మహిళలకు పెద్దగా చదువు ఉండదని.. అందుకే రాజకీయాల కోసం వెనకబడిన కులాల మహిళల తరపున బీజేపీ వాళ్లు మాట్లాడారని ఆరోపించారు. గట్టిగా పోరాటం చేసే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీ వాళ్లకు ఇష్టం లేదన్నారు. బలహీన వర్గాల మహిళలను బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలహీనపడుతోందన్నారు ఖర్గే. చాలా రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని చెప్పారు.
వెనకబడిన వర్గాల మహిళలపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను బీజేపీ సభ్యులు తప్పుపట్టారు. బలహీన వర్గాల వారికే టికెట్లు ఇస్తున్నారన్న ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసింది బీజేపీనే అని చెప్పారు.
మరోవైపు.. జీఎస్టీ నిధులపైనా రాజ్యసభలో రచ్చ జరిగింది. చాలా రాష్ట్రాలకు జీఎస్టీ నిధులు ఇవ్వడం లేదని ఖర్గే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా జీఎస్టీ బకాయిలు పెండింగ్ లో లేవన్నారు. ఒకవేళ బకాయిలు ఉన్నట్లు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ చేశారు. రాజ్యసభ బుధవారం (సెప్టెంబర్ 20వ తేదీకి)కి వాయిదా పడింది.