- జూబ్లీహిల్స్ ఆర్ఓకు అందజేసిన
- కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, మీడియా సెల్ చైర్మన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ.. కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, పీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు నిబంధనలకు విరుద్ధంగా చర్చిలకు వెళ్లి.. అభ్యర్థి పేరు, ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
అందుకు సంబంధించిన ఆధారాలను ఆర్ఓకు అందజేసి.. చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా అక్రమాలకు పాల్పడుతోందన్నారు. దొంగతనంగా పోల్ చిట్టీలు పంచుతూ.. కేటీఆర్ పొంకనాలు కొడుతున్నాడని.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓడిపోవాలని కేటీఆర్ చూస్తున్నట్టున్నాడని ఆయన ఆరోపించారు.
ఓడిపోతామని తెలిసే బీఆర్ఎస్ ఇలాంటి పిచ్చి నాటకాలు చేస్తోందన్నారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఇదంతా హరీశ్ రావు ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్నట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. అలాగే, వారి సొంత పేపర్, చానల్ లో ఇష్టం వచ్చినట్టు పెయిడ్ వార్తలు రాసుకుంటున్నారన్నారు. అవన్నీ అభ్యర్థి ఎన్నికల ఖర్చులో జమ చేయాలన్నారు. తాము కూడా వారిలాగే మాట్లాడాలంటే.. దుబాయ్ శేఖర్ నుంచి మాట్లాడాల్సి ఉంటుందన్నారు.
సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ రాకముందే బీఆర్ఎస్ నానా హంగామా చేసిందని, ఇప్పుడు అభ్యర్థి ఫొటోతో పోల్ చిట్టీలు పంచుతున్నదన్నారు. తాము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. చర్యలు తీసుకోవాలని ఆర్ఓకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారో.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
