కాంగ్రెస్​ చెప్పిందే చేస్తుంది : భట్టి విక్రమార్క

కాంగ్రెస్​ చెప్పిందే చేస్తుంది : భట్టి విక్రమార్క

మధిర/బోనకలు/ఎర్రుపాలెం, వెలుగు :  కాంగ్రెస్​ చెప్పిందే చేస్తుంది... చేసేదే చెప్తుందని సీఎల్పీ నేత, మధిర అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎర్రుపాలెం మండలం వెంకటాపూర్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం బోనకల్ మండలంలో మోటమర్రి అంకమ్మ దేవాలయంలో భట్టి  పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. మండలంలోని మోటమర్రి, రాయన్నపేట, ఆళ్ళపాడు, గోవిందాపురం, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి, గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన భట్టికి మంగళ హారతులతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. కమ్యూనిస్టులు, తెలుగుదేశం శ్రేణులు భట్టి విక్రమార్క కు మద్దతు ప్రకటించి సీపీఐ , టీడీపీ జెండాలతో ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర సంపదను ప్రజలకు పంచకుండా పాలకులు దోచుకుంటున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలకులు దోచుకున్న సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు. రాష్ట్రంలో ఫ్రీ కరెంటుకు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందన్నారు. తెలంగాణలో  విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ పార్టీ కావాల్సిన అన్ని సదుపాయాలను చేసిందని చెప్పారు. జైపూర్, భూపాలపల్లి, ఎన్టీపీసీ, కేటీపీఎస్ మూడు దశలు నిర్మాణం లాంటి అనేక పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందన్నారు. సొమ్మొకడిది సోకొకడిది అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడివని అనడానికి కేసీఆర్, కేటీఆర్ కు బుద్ధుండాలని

కాంగ్రెస్ హామీల అమలుకు నిధులు లేకుంటే బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు గుణపాఠం చెపాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. గోవిందాపురం నుంచి మోటమర్రి వరకు ఉన్న డొంక రోడ్డును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో బీటీ రోడ్డుగా మారుస్తానని హామీ ఇచ్చారు. 

ALSO READ : కృష్ణ చెక్ పోస్ట్ ను పరిశీలించిన అబ్జర్వర్లు

కాంగ్రెస్ లో చేరికలు..

సీఎల్పీ నేత భట్టి సమక్షంలో మధిర నియోజకవర్గం చింతకాని మండల ఎంపీపీ కోపూరి పూర్ణయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తుమ్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా బోనకల్ మండలం మోటమర్రి గ్రామంలోబీఆర్ఎస్ మండల నాయకులు మోదుగు మారతమ్మ, కన్నెపోవు నాగేశ్వరరావు, మోదుగు కృష్ణమూర్తి, వల్లపు కనకయ్య, వల్లపు ఆనసూర్య తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.