సోనియా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు

సోనియా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు

ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్లకు చుక్కెదురైంది. పార్టీ చీఫ్ సోనియాగాంధీ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో పడరానీ పాట్లు పడ్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ పై ఫిర్యాదు చేయడానికి హాస్తిన వెళ్లిన నేతలు... ఇప్పుడు అయోమయంలో పడ్డారు. తిరిగి రాలేక, అపాయింట్మెంట్ దొరక్క.... అయోమయంలో పడ్డారు సీనియర్లు.  తెలంగాణలో కాంగ్రెస్  పార్టీ పరిస్థితి, పీసీసీ చీఫ్ రేవంత్ తీరు పై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీలో సోనియా అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ పీసీసీగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఓ వర్గం నేతలు ఆయనతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేత జగ్గారెడ్డి ఎపిసోడ్ తో అస్త్రం దొరికినట్టుగా భావించారు.

ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమితో అక్కడ పీసీసీ చీఫ్ లను తొలగించింది హైకమాండ్. ఇదే మంచి అనుకొని హస్తిన వెళ్లారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు. గతంలోనూ రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. ఇప్పుడు నేరుగా పార్టీ చీఫ్ ను కలిసి అన్ని విషయాలను వివరించాలని డిసైడయ్యారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోనియాను కలిసే చాన్స్ ఉంటుందని భావించారు సీనియర్లు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. అంతకుముందు సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో అసంతృప్త నేతలంతా రెండు, మూడు సార్లు భేటీ అయ్యారు. ఐతే నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు సోనియా అపాయింట్మెంట్ కోసం సీరియస్ గా ట్రై చేసినా దొరకలేదని సమాచారం. 
రేవంత్ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకుంటామని హస్తినకు వెళ్లిన నేతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. సోనియా అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులు ఉండాలో అర్ధం కావడం లేదని అంటున్నారు. ఒక్కరిద్దరు నేతలు ఇవాల్టి వరకు వెయిట్ చేసి వెనుదిరిగి వచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర నేతలకు ఇప్పుడప్పుడే సోనియా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను కలిసిన రేవంత్ పార్టీలో జరుగుతున్న విషయాలు, లాయలిస్టుల పేరుతో సీనియర్ల సమావేశాలపై ఆయనకు రిపోర్ట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ సీనియర్ల పంచాయితీ హస్తినకు చేరినా ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. 

 

 

 

ఇవి కూడా చదవండి

సమస్యలు తెలుసుకుని ఓదారుస్తూ షర్మిల పాదయాత్ర

వైరల్ వీడియో: మురికి కాలువను క్లీన్ చేసిన కౌన్సిలర్

పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీల ధర్నా