
- 144 సెక్షన్ ఉన్నా కేటీఆర్ దీక్ష దివస్ చేశారని ఆరోపణ
- ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉన్నా, ఎన్నికల ప్రచార గడువు ముగిసినా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహించిందని ఆరోపించింది. కోడ్ అమల్లో ఉన్నా మంత్రి కేటీఆర్ దీక్షా దివస్‌లో ఎలా పాల్గొంటారని, కోడ్‌ను ఆయన ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాకుండా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్నీ నిబంధనలను తొక్కిపెట్టి నిర్వహించారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ ఫిర్యాదు లేఖలు రాశారు.
దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకునేలా జిల్లా ఎన్నికల అధికారులు, డీజీపీ, ఎస్పీలకు ఆదేశాలివ్వాలని కోరారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ పత్రిక.. కాంగ్రెస్‌పై తప్పుడు కథనాలను ప్రచురించిందని, ప్రచారం ముగిసినా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ప్రజలను ప్రభావితం చేసేలా కథనాలను ప్రచురించిందని మరో లేఖలో పేర్కొన్నారు. ఆ పత్రికపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ఏపీ ఆపుతున్నదని ఫిర్యాదు
ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న రాష్ట్ర ఓటర్లను ఏపీ పోలీసులు కావాలని బార్డర్ల వద్ద నిలిపివేస్తున్నారని నిరంజన్ మరో ఫిర్యాదు చేశారు. చాలా మంది తెలంగాణవాసులు బిజినెస్, బంధుత్వాలు వంటి కారణాలతో ఏపీలో ఉంటున్నారని, వాళ్లు ఓటేసేందుకు రాష్ట్రానికి వస్తుంటే
రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏపీ పోలీసులు బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టి ఆపుతున్నారని పేర్కొన్నారు. తద్వారా జనాల ఓటు హక్కును కాలరాస్తున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కేంద్ర ఎన్నికల సంఘంతో ఆదేశాలిప్పించాలని కోరారు.