- కాంగ్రెస్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం: మహేశ్ గౌడ్
- పీసీసీ చీఫ్ అవుతానని కలలో కూడా అనుకోలే
- బీసీ బిడ్డ అయిన నాకు హైకమాండ్ చాన్స్ ఇచ్చిందని వ్యాఖ్య
నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నియమించిన 33 డీసీసీ ప్రెసిడెంట్ పోస్టుల్లో 16 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. 75 శాతం పీసీసీ పోస్టులను కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో భర్తీ చేశామని ప్రకటించారు. బడుగుబలహీన, దళిత, గిరిజనుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలన్నారు.
పీసీసీ చీఫ్ అవుతానని తాను కలలో కూడా అనుకోలేదని, బీసీ బిడ్డనైన తనను ఇంతటి కీలక స్థానంలో హైకమాండ్ కూర్చోబెట్టిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహేశ్ గౌడ్ ఆదివారం హాజరై మాట్లాడారు. ‘‘మున్నూరు కాపులకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రయారిటీ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి డీ శ్రీనివాస్‌ను 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్‌ను చేసింది.
అంతకు ముందు కాపు నేతలైన వీ హన్మంత్‌రావు, కేశవ్ రావు, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు’’అని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ కూడా బీసీల కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నదని, 42 శాతం బీసీ రిజర్వేషన్ అందులో భాగమని తెలిపారు. అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పక్కనబెడితే ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, కుల సర్వే కూడా హిస్టరీలో నిలిచిపోయే ఘట్టం అని మహేశ్ అన్నారు.
కులపిచ్చి మంచిది కాదు
బీసీ కులాలు ఐక్యంగా ఉంటే మొత్తం జనాభాలో 56 శాతం అవుతారని.. అదే విడివిడిగా ఉంటే నాలుగైదు శాతానికి పరిమితం అవుతారని మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘బీసీలంతా ఒక్కటిగా ఉండాలి. ఇందుకు కులాభిమానం చాలు. కులపిచ్చి ఏ మాత్రం మంచిది కాదు. ఇంతకు ముందులా మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటది’’అని మహేశ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు పీ సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, తాహెర్, అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
11 ఎకరాల సొంత ల్యాండ్ విరాళం
నిజామాబాద్ జిల్లాలోని తన స్వగ్రామమైన భీంగల్ మండలం రహాత్నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 10 ఎకరాలు, సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎకరం భూమిని మహేశ్ గౌడ్ విరాళంగా ఇచ్చారు. గతంలో ఆయన తండ్రి బొమ్మ గంగాధర్‌గౌడ్ నిర్మించిన దుర్గాదేవీ ఆలయ అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు కేటాయించి భూమి పూజ చేశారు.
రహాత్ నగర్ మీదుగా కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ, ధర్మపురి ఆలయాలను కలుపుతూ రూ.380 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్ నిర్మించబోతున్నామని తెలిపారు. భూమి విరాళంగా ఇచ్చిన మహేశ్ గౌడ్‌ను గ్రామస్తులు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, స్టేట్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
