- అసెంబ్లీకి హాజరు కావాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్
గజ్వేల్/ములుగు, వెలుగు: ప్రతిపక్ష నేతగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి పోవాలని లేదంటే వెంటనే రాజీనామా చేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్గేట్ వద్ద రెడ్ కార్పెట్ పరిచి, పూలు జల్లి కేసీఆర్ బయటకు రావాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్న నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ నడుస్తున్నా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నాడని తెలిపారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలని, రాష్ట్ర సమస్యలు ప్రస్తావించాలని, వాటిని అందరం కలసి పరిష్కరించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినా కేసీఆర్ సంతకం చేసి వెళ్లిపోవడం సరైంది కాదన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ స్టార్ట్ చేసిన పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలని కోరారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణానికి సహకరించిన నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, సమస్యలు తీర్చాలన్నారు. లేదంటే పదవికి రాజీనామా చేస్తే, పని చేసే వ్యక్తి ఎమ్మెల్యేగా వస్తాడన్నారు. గతంలోనూ అనేక కార్యక్రమాలు చేపట్టినా బయటకు రావడం లేదన్నారు. గజ్వేల్, ఒంటిమామిడి ఏఎంసీ చైర్మెన్లు వంటేరు నరేందర్ రెడ్డి, విజయమోహన్, వైస్ చైర్మన్లు సర్ధార్‌ఖాన్, ప్రభాకర్‌గుప్తా పాల్గొన్నారు.
