తెలివైనోళ్లు ఎవరూ ఇలాంటి పని చేయరు: ఆజాద్

తెలివైనోళ్లు ఎవరూ ఇలాంటి పని చేయరు: ఆజాద్

జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ సీఎం గులామ్‌ నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. జమ్ము కశ్మీర్‌‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. కశ్మీర్‌‌లోని కుల్గామ్‌లో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడారు. సాధారణంగా ఎక్కడైనా కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర హోదా ఇచ్చి అప్‌గ్రేడ్ చేస్తారని, కేంద్ర ప్రభుత్వం మాత్రం మన రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిందని మండిపడ్డారు. ఈ పని.. డీజీపీని ఒక సాధారణ ఇన్‌స్పెక్టర్‌‌గానో, సీఎంను ఎమ్మెల్యేగానో, చీఫ్ సెక్రెటరీని పంచాయతీ సెక్రెటరీగానో మార్చినట్లుగా ఉందంటూ పోలిక పెట్టారాయన. తెలివైన వ్యక్తి ఎవరూ ఇలాంటి పనులు చేయరని అన్నారు.

కాగా, జమ్ము కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలో జమ్ము కశ్మీర్‌‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించి, జమ్ము కశ్మీర్, లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయంపై నాడు పలు ప్రతిపక్ష పార్టీలు తమ వ్యతిరేకతను తెలిపాయి. జమ్ము కశ్మీర్‌‌కు మళ్లీ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరాయి. గతంలో కశ్మీర్‌‌లో నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ సహా పలు అంశాలపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ మెజారిటీ పార్టీ తమ డిమాండ్‌ను వినిపించాయి. రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని తమ వాదనను వినిపించాయి. దీనిపై కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు ఆ సమయంలో ప్రతిపక్షాలు చెప్పుకొచ్చాయి.