తెలంగాణలో ముస్లింల ఓట్లపై కాంగ్రెస్​ ఫోకస్​​.. ఎంఐఎంపైనా ఎదురు దాడి

తెలంగాణలో ముస్లింల ఓట్లపై  కాంగ్రెస్​ ఫోకస్​​..  ఎంఐఎంపైనా ఎదురు దాడి
  •     ముస్లిం రిజర్వేషన్లు  12 శాతానికి పెంచేలా కసరత్తు
  •     మైనారిటీ డిక్లరేషన్​లో చేర్చేందుకు నేతల నిర్ణయం
  •     ఎడ్యుకేషన్, ఆర్థిక సాయంపైనా ఫోకస్​
  •     ఎంఐఎంపైనా ఎదురు దాడి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ​అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే మహిళలు, యూత్, రైతులు, ఎస్సీలకు వరుస హామీలు ప్రకటించిన ఆ పార్టీ నేతలు.. బీసీలు, ముస్లింలపైనా దృష్టి సారించారు. ముఖ్యంగా ముస్లిం ఓటర్లను తమ పార్టీ వైపునకు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక తరహాలో ముస్లింల ఓట్లు పడితే అధికారంలోకి రావొచ్చన్న ధీమాలో పార్టీ నేతలున్నారు. అందులో భాగంగా మైనారిటీ డిక్లరేషన్​లో వారి కోసం కీలకమైన అంశాలు పొందుపరిచేలా కసరత్తు చేస్తున్నారు. షబ్బీర్​ అలీ చైర్మన్​గా ఏర్పాటైన మైనారిటీ డిక్లరేషన్​ కమిటీ.. ఇప్పటికే రెండు మూడు సార్లు భేటీ అయింది. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించింది. ఏమేం పెడితే బాగుంటుందో మత పెద్దలు, ముస్లిం విద్యావేత్తల నుంచి  ఒపీనియన్లను తీసుకుంటున్నది.

కోటా పెంపు?

రాష్ట్రంలో ముస్లింల కోటాను పది శాతానికి పెంచుతామని ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీలోనే దానిపై తీర్మానం చేశారు. అయితే, అది ఇప్పటిదాకా అమలుకాలేదు. ప్రస్తుతం పాత కోటా అయిన 4 శాతం రిజర్వేషన్లే అమలవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్​ పార్టీ నేతలు సమయం దొరికినప్పుడల్లా బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కోటా ఎటుపోయిందని నిలదీస్తున్నారు. ఇప్పుడు పార్టీ మైనారిటీ డిక్లరేషన్​లో ఇదే విషయాన్ని కీలకంగా ప్రస్తావించనున్నట్టు తెలుస్తున్నది. ముస్లింల కోటా పెంపును ప్రముఖంగా చేరుస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధికారంలోకి వచ్చాక ముస్లింల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచేలా డిక్లరేషన్​లో చేర్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీన్నే ముస్లిం ఓట్లను రాబట్టేందుకు ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.  విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించేందుకు యోచిస్తున్నారు. ముస్లింలకు మెరుగైన విద్యను అందించడం కోసం ప్రత్యేకమైన మైనారిటీ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్​లను నెలకొల్పాలని పార్టీ నేతలు భావిస్తున్నారట. వివిధ కులాలకు ఇస్తున్నట్టే మైనారిటీల్లోని వెనుకబడిన కులాల వారికీ ఆర్థిక సాయం స్కీములను అందించాలని యోచిస్తున్నారట.

పార్టీ నేతలకు టాస్క్​?

ముస్లిం ఓటర్లను పార్టీ వైపునకు తిప్పుకునేలా నేతలకు టాస్క్​ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ముస్లింల కోసం కాంగ్రెస్​ పార్టీ చేసిన పనులు.. అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి వివరించేలా ప్రత్యేకంగా ప్రోగ్రామ్​ను చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఇంటింటికీ గ్యారెంటీ కార్డుల పంపిణీలో భాగంగా ముస్లిం కుటుంబాలకు బీజేపీ, ఎంఐఎంల మధ్య దోస్తానా ఉందంటూ చెప్పే  ప్రయత్నం చేస్తున్నారు.

ముస్లింలకు చేరువయ్యే యత్నం

హైదరాబాద్​ సిటీ సహా పలు జిల్లాల్లో ముస్లింలు గెలుపోటములను శాసించగల స్థాయిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం జనాభా 40 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారిని ఆకర్షించే పనిలో పడ్డారు కాంగ్రెస్​ లీడర్లు. హైదరాబాద్​లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం పాగా వేస్తుండడంతో.. ఆ పార్టీపైనా ఎదురుదాడిని మొదలుపెట్టారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఆ పార్టీవైపు చూస్తుండడంతో.. ఎంఐఎంను మతతత్వ పార్టీ అని చూపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి బీ టీమ్​ అంటూ ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. 

కాంగ్రెస్​ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని, అసలు సిసలైన సెక్యులర్​ పార్టీ అని ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్​ ఓల్డ్​సిటీలో ఏడు స్థానాలను గెలిచిన ఎంఐఎం పార్టీ నేతలు.. వారి వారి నియోజకవర్గాలను ఎంత మేర అభివృద్ధి చేశారో చెప్పాలని ఎంఐఎం నేతలను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీకి ముస్లిం ఓటర్లు ఒక్క అవకాశం ఇవ్వాలని ముఖ్య నేతలు కోరుతున్నారు. ఇప్పటికే పలు సభలు, సమావేశాల్లో బహిరంగంగానే నేతలు ముస్లిం ఓటర్లకు విజ్ఞప్తి కూడా చేశారు.