
కరీంనగర్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను గుర్తించాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో విప్ ఆది శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణరావు మేడిపల్లి సత్యం, కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, కాంగ్రెస్ నేత అల్ఫోర్స్‌నరేందర్‌రెడ్డి, సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కేకే మహేందర్‌రెడ్డి, ప్రణవ్‌బాబు పాల్గొన్నారు.
ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే
ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే అప్పగించినట్లు తెలిసింది. జడ్పీటీసీల విషయంలోనూ డీసీసీ అధ్యక్షులు ఒక్కో స్థానం నుంచి నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి పీసీసీకి పంపాల్సి ఉంటుంది. అనంతరం హైకమాండ్ సొంతంగా సర్వే చేయించి నలుగురిలో ఒకరి పేరును ఖరారు చేస్తుంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన జాబితాను ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు హైకమాండ్‌కు అందజేశారు.
అనంతరం ఈ నెల 8న లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై కోర్టు తీర్పుపైనా చర్చ జరిగింది. తీర్పు ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలని ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించినట్లు తెలిసింది.
కరీంనగర్ గెలుపు బాధ్యత వెలిచాలకు
కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుకు అప్పగించినట్లు తెలిసింది. కొన్నిరోజులుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పోస్ట్ ఖాళీగా ఉండడంతో స్థానిక సంస్థల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతను వెలిచాలకు అప్పగించినట్లు సమాచారం.