మహిళలపై అఘాయిత్యాల నివారణపై ఈ నెల 15న అఖిలపక్షం

మహిళలపై అఘాయిత్యాల నివారణపై ఈ నెల 15న అఖిలపక్షం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, పోలీసులపై ఒత్తిడి తేవడంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. సీబీఐ, ఈడీలు బీజేపీ అనుబంధ విభాగాలుగా మారిపోయాయని రేవంత్ ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ముందు సోమవారం నిరసన చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు సోమవారం నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి బషీర్ బాగ్ ఈడీ ఆఫీసుకు వెళ్లి నిరసన వ్యక్తంచేయాలని పిలుపునిచ్చారు. మహిళలపై పెరుగుతున్న ఆకృత్యాల నివారణపై చర్చించేందుకు ఈ నెల 15న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ భేటీకి టీఆర్ఎస్, బీజేపీలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. 

రైతు రచ్చబండ కార్యక్రమం ఆశించిన స్థాయిలో జరగడం లేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం రైతు రచ్చబండ కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడగిస్తున్నట్లు చెప్పారు. నేతలెవరూ గాంధీ భవన్ రావద్దని, గ్రామాల్లోనే ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. పార్టీ పదవులు రావాలంటే నేతలు జనాల్లోనే ఉండాలని సూచించారు.