శివమొగ్గ/బెంగళూరు/నంజన్‌గుడ్: దేశం నుంచి కర్నాటకను వేరు చేసేందుకు కాంగ్రెస్ బహిరంగంగానే ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే విషయంలో కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ ముందుంటుందని ఆరోపించారు. దేశంలోని రాజకీయాలను ప్రభావితం చేసేందుకు.. జోక్యం చేసుకోవాలంటూ విదేశీ శక్తులను ఈ ఫ్యామిలీ ప్రోత్సహిస్తున్నదన్నారు. వాళ్ల గేమ్‌ను దేశం ఎన్నటికీ క్షమించబోదని మండిపడ్డారు. ఆదివారం బెంగళూరులో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. శివమొగ్గ, మైసూర్ జిల్లాలోని నంజన్‌గుడ్‌లో నిర్వహించిన సభల్లో ప్రధాని మాట్లాడారు. భారతదేశాన్ని ద్వేషించే విదేశీ దౌత్యవేత్తలను కాంగ్రెస్ రహస్యంగా కలుస్తోందని, భారతదేశ సార్వభౌమత్వాన్ని అవమానించే కార్యకలాపాలకు పదేపదే పాల్పడుతోందని ఆరోపించారు. ‘‘కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ షాహీ పరివార్ (రాజ కుటుంబం) ఒక అడుగు ముందుకేసి.. అన్ని హద్దులను ఛేదించి, దేశ మనోభావాలను తుంగలో తొక్కింది.
కేవలం కర్నాటకకే కాదు.. యావత్ దేశానికి ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ‘షాహీ పరివార్’ నిన్న (శనివారం) ఇక్కడికి వచ్చి కర్నాటక సార్వభౌమాధికారాన్ని కాపాడాలని అనడం చాలా బాధాకరం. కర్నాటక సార్వభౌమాధికారం అంటే ఏంటో తెలుసా? ఏదైనా దేశానికి స్వతంత్రం వస్తే అప్పుడు దాన్ని సార్వభౌమాధికార దేశం అంటారు. కాంగ్రెస్ మాటల్ని బట్టి చూస్తే.. దేశంలో కర్నాటక భాగం కాదని, వేరు అని ఆ పార్టీ విశ్వసిస్తోందని తెలుస్తోంది. ఇన్నాళ్లు పార్లమెంట్‌లో కూర్చొని, రాజ్యాంగంపై ప్రమాణం చేసి వాళ్లు చెప్పే మాటలు ఇవీ. కర్నాటకను వేరు చేయాలని కాంగ్రెస్ బహిరంగంగానే వాదిస్తోంది. మరి ప్రజలు దీన్ని అంగీకరిస్తారా? లేక కాంగ్రెస్‌ను శిక్షిస్తరా?” అని ప్రశ్నించారు. ‘తుక్డే -తుక్డే గ్యాంగ్’ వ్యాధి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు.
ప్రచారానికి దూరంగా ఉన్నోళ్లనూ పట్టుకొస్తున్నరు
అబద్ధాలు పని చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ భయపడిపోయిందని, ఓటమి భయంతో ప్రచారానికి దూరంగా ఉన్న నేతలనూ తీసుకొస్తోందని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు సోనియా గాంధీ రంగంలోకి దిగడంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెబితే ఎంతమాత్రం ప్రయోజనంలేదని కాంగ్రెస్ వాళ్లకు అర్థమైందన్నారు. ఇప్పటికే ఓటమికి బాధ్యతను ఒకరిపై ఒకరు వేసుకోవడం కాంగ్రెస్ నేతల్లో మొదలైందని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధాల బెలూన్‌ను ప్రజలు పగలగొట్టారని, ఇక పని చేయడంలేదని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాల మధ్య చీలికను సృష్టిస్తోందని, మత విద్వేషాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ ఇలాంటి పనులు చేసినప్పుడల్లా, ఓడించడానికి భారతదేశ ప్రజలు ఐక్యంగా ఉంటారన్నారు. ‘రాజకీయ ఆక్సిజన్’ పొందేందుకు కర్నాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోందని, ఈ పాపాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ క్షమించరని, మే 10న కాంగ్రెస్‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తుందన్నారు.‘‘రోగనిరోధక శక్తిని పసుపు పెంచుతుందని కరోనా సమయంలో నేను చెప్పినప్పుడు కాంగ్రెస్ ఎగతాళి చేసింది. వాళ్లు అవమానించింది నన్ను కాదు.. పసుపు రైతుల్ని” అని ప్రధాని మోడీ అన్నారు.
మీ ప్రేమను తిరిగి చెల్లిస్త..
‘‘మేం భారీ రోడ్ షో నిర్వహించాల్సింది. కానీ ఈరోజు నీట్ పరీక్ష ఉంది. మన పరీక్ష (ఎన్నికలు) మే 10న అని నేను మా పార్టీకి చెప్పాను. పిల్లల పరీక్షను జాగ్రత్తగా జరగనివ్వాలి. అందుకే మేము ఉదయం రోడ్‌షోను త్వరగా ముగించాం’’ అని మోడీ అన్నారు.‘‘ఆదివారమైనా సరే.. బెంగళూరు ప్రదర్శించిన బలం, విశ్వాసం, ప్రేమ నా హృదయాన్ని తాకుతున్నాయి. నేను కర్నాటకకు రుణపడి ఉంటాను. నాపై ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలను తిరిగివ్వాలని కోరుకుంటున్నా. మీకు అసలైన హామీ ఇవ్వాలనుకుంటున్నా. కర్నాటకను అభివృద్ధి చేస్తా.. మీ ప్రేమను తిరిగి చెల్లిస్తా” అని అన్నారు. ‘‘ఇక్కడితో నా ప్రచారాన్ని ముగిస్తున్నా.. ఇక మీరు బాధ్యత తీసుకోండి” అంటూ ఈ నెల 10న ఓటు వేయాలని ప్రజలను కోరారు.
రెండో రోజూ మెగా రోడ్‌షో
.
ఉదయం 10 గంటల సమయంలో బెంగళూరులోని కెంపెగౌడ స్టాచ్యూ నుంచి ప్రధాని రోడ్‌షో మొదలైంది. కెంపెగౌడ విగ్రహానికి పూలమాల వేసి మోడీ నివాళులర్పించారు. మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. 11.30కు ట్రినిటీ సర్కిల్ వద్ద ముగిసింది. ప్రధాని కోసం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ పీసీ మోహన్ వాహనాన్ని తయారు చేయించారు. శనివారం 26 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగగా.. ఆదివారం 10 కిలోమీటర్ల మేర నిర్వహించారు.