మజ్లిస్ కోటను ఢీ కొట్టేలా కాంగ్రెస్ ప్లాన్!

మజ్లిస్ కోటను ఢీ కొట్టేలా  కాంగ్రెస్ ప్లాన్!
  • సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ ఇవ్వని ఎంఐఎం
  • తీవ్ర మనస్తాపంలో ముంతాజ్ ఖాన్, ఆయన మద్దతుదారులు
  •  వారితో మంతనాలు కొనసాగిస్తున్న హస్తం నేతలు 
  • రెండ్రోజుల్లో ఏదో ఒకటి చెప్పాలంటూ సూచన

హైదరాబాద్,వెలుగు : ఓల్డ్ సిటీలో పాగా వేసేందుకు కాంగ్రెస్​ తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మజ్లిస్ ​కోటను ఢీకొట్టాలని,  ఏడు సెగ్మెంట్లలో రెండింటిని చేజిక్కించుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నాంపల్లి నుంచి బలమైన అభ్యర్థి ఫిరోజ్​ఖాన్​ను బరిలోకి దింపింది. ఇక చార్మినార్ ​ఎమ్మెల్యే ముంతాజ్​ఖాన్​కు మజ్లిస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీన్ని కాంగ్రెస్​తనకు అవకాశంగా మలుచుకునేందుకు ప్లాన్ చేసింది.

ముంతాజ్​ఖాన్​ను పార్టీలోకి రావాల్సిందిగా కాంగ్రెస్​ నేతలు ఆయనతో మంతనాలు కొనసాగిస్తున్నారు. ఈ కారణంగానే చార్మినార్​నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిని ప్రకటించకుండా వెయిటింగ్​లో పెట్టింది. ముంతాజ్​ ఖాన్​ పార్టీలోకి వస్తే ఆయననే ప్రకటించనుంది. కాగా మజ్లిస్​ పార్టీ ఆయన కాంగ్రెస్​లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నది. ముంతాజ్ ​ఖాన్​కు అత్యంత సన్నిహితుడైన జాఫర్ ​పహిల్వాన్​పై పోలీసు కేసులతో ఇబ్బంది పెట్టిస్తుంది. ఒక విధంగా ఇది ముంతాజ్​ఖాన్​ను బెదిరించడమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముంతాజ్​.. మజ్లిస్​ను వీడితే కేసుల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు సమాచారం. 

కాంగ్రెస్​లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ..

40 ఏండ్లకు పైగానే మజ్లిస్​లో కొనసాగుతున్న ముంతాజ్.. తనకు మాత్రమే కాకుండా, తన కొడుక్కి కూడా టికెట్​ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. కానీ ఆయన సేవలను పార్టీకి వాడుకుంటామని,  అనుభవం ఎంతో అవసరమని ఇటీవల మీడియా సమావేశంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్​ ఒవైసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పార్టీలో సరైన గౌరవం ఇవ్వకుండా, కాంగ్రెస్​లో చేరకుండా ముంతాజ్ అనుచరులపై మజ్లిస్​ కేసులు నమోదు చేయిస్తున్నట్లు ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంతాజ్​ కాంగ్రెస్​లో చేరాలా? లేక ఇండిపెండెంట్​గా పోటీ చేయాలా? అనే  డైలామాలో ఉన్నట్టు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే నామినేషన్​ప్రక్రియ ఈనెల 10వ తేదీతో ముగియనుండడంతో వెంటనే దీనిపై తేల్చాలని  కాంగ్రెస్ సూచించింది.