జూబ్లీహిల్స్లో గెలిచేది కాంగ్రెస్సే.. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంతో బీజేపీకి దిమ్మతిరిగింది: మంత్రి వివేక్

జూబ్లీహిల్స్లో  గెలిచేది కాంగ్రెస్సే.. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంతో బీజేపీకి దిమ్మతిరిగింది: మంత్రి వివేక్
  • మంత్రినైనా చెన్నూరుకు వెళ్తున్నా..వారంలో రెండు రోజులు అక్కడే ఉంటున్న
  • బీఆర్ఎస్​ గోబెల్స్ ​​ప్రచారాన్ని జనం నమ్మరు
  • మాల, మాదిగలు అంటూ నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నరు.. 
  • వంశీకృష్ణకు ఎంపీ టికెట్ ​ఇవ్వకుండా అడ్డుపడ్డరు
  • నార్త్​ తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ గెలిచింది పెద్దపల్లిలోనే..
  • ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న
  • ‘వీ6  వెలుగు’ ఇంటర్వ్యూలో మంత్రి వివేక్​ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి 12 శాతం ఓట్ల మెజార్టీతో గెలుస్తారని రాష్ట్ర కార్మిక ఉపాధి, మైనింగ్​ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన చెన్నూరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నానని, వారంలో 2 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని  తెలిపారు. తనను ఉమ్మడి మెదక్​ జిల్లా ఇన్​చార్జిగా నియమించడం, ఇటీవల జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించడంతో చెన్నూరు ప్రజలకు దూరమయ్యానంటూ  కొందరు గోబెల్స్​​ ప్రచారం చేస్తున్నారని,  ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.  

ఎవరెన్ని విమర్శలు చేసినా తాను పార్టీ లైన్‌‌లో పనిచేసుకుంటూ ముందుకు పోతున్నానని, తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్నానని, ఈ క్రమంలో లోకల్​ లీడర్లకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నానని స్పష్టంచేశారు.  జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇన్‌‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి వివేక్​ వెంకటస్వామి.. శనివారం ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

జూబ్లీహిల్స్​ లో పరిస్థితి ఎలా ఉంది?

నేను, నా సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్​, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు గత రెండు నెలలుగా జూబ్లీహిల్స్​ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చాలా విస్తృతంగా పర్యటించినం. అన్ని డివిజన్లలో తిరిగినం. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్​ హయాంలో కేటీఆర్​ మున్సిపల్​ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ నియోజకవర్గంలో చాలా పనులు పెండింగ్‌‌లో ఉన్నయ్​. 

డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు కనిపించినయ్​. ప్రజలు గత పదేండ్లుగా సమస్యలతో బాధపడ్తున్నట్లు  మాతో చెప్పిన్రు.   సమస్యలను అక్కడిడక్కడే పరిష్కరిస్తున్నం. దీంతో అక్కడి ప్రజలకు కాంగ్రెస్​ పార్టీపై నమ్మకం ఏర్పడింది.  మా పార్టీ అభ్యర్థికి ఇప్పటికే అక్కడ 5 శాతం ఓట్ల ఆధిక్యత కనిపిస్తున్నది. పోలింగ్​నాటికి ఇది 12 శాతానికి పెరుగుతుంది. ఉప ఎన్నిక కాంగ్రెస్​కు వన్‌‌సైడ్​ అవుతాయి.

పదేండ్లలో జూబ్లీహిల్స్​లో అభివృద్ధి జరగలేదా?

కృష్ణానగర్, వెంగళరావునగర్ తదితర చాలా డివిజన్లలో చిన్నవాన వస్తే చాలు వాటర్​ రోడ్ల పై నుంచి పోతాయి. ఎక్కడికక్కడ బురద పేరుకుపోతుంది. వీటిని చూస్తే పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదని చిన్న పిల్లాడికి కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్​ పార్టీ సోషల్​ మీడియాలో చాలా స్ట్రాంగ్‌‌గా ఉంటుంది.. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ పార్టీ గోబెల్స్​​ ప్రచారం చేస్తున్నదనే విషయం అందరికీ బోధపడుతుంది. ముస్లింలు ఖబరస్తాన్​​ కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మేం జిల్లా కలెక్టర్‌‌‌‌తో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడానికి ఆదేశాలు జారీచేసినం. అలాగే, ఎన్నికల కోడ్​ కంటే ముందే చాలా సమస్యలను పరిష్కరిస్తూ ఓపెనింగ్స్​చేసినం. ఈ కార్యక్రమాలకు లోకల్​ ప్రజలు ఎక్కువగా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నం.  

మీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి?

ఏ పార్టీ అయితే సమస్యలను పరిష్కరించే స్థాయిలో ఉంటుందో ఆ పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపిస్తరు. కంటోన్మెంట్​ ఉప ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. ప్రజలకు కావాల్సింది పనిచేసేటోళ్లు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న అభ్యర్థి గెలిస్తే తమకు ఏంటి లాభం? అని ఓటర్లు ఆలోచిస్తున్నరు. మా పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలుచేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా వీటికి ప్రయారిటీ ఇస్తున్నం. 200 యూనిట్ల ఉచిత కరెంట్​, 500కే గ్యాస్​ సిలిండర్​, మహిళలకు ఉచిత బస్​ జర్నీ, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్​ కార్డుల అందజేతలాంటి కార్యక్రమాలు మా పార్టీ అభ్యర్థి గెలుపునకు  దోహదపడతయ్.  

హైడ్రాపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఏమంటరు? 

ప్రతిపక్షాలకు ఏ ఇష్యూ దొరకట్లేదు. హైడ్రా పేరుతో గేమ్​ఆడుతున్నరు. ఇదంతా ఫేక్​ ప్రచారం. బీఆర్ఎస్​ వాళ్లు ఆడుతున్న నాటకం. రెహమత్‌‌నగర్, షేక్ పేట్, బోరబండ డివిజన్లలో 100 జేసీబీలతో హైడ్రా ఇండ్లు కూలగొడుతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చినయ్.​ నేను వీటిని చూసి హైడ్రా, జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు  ఫోన్​ చేసి అడిగిన.  మీ దగ్గర 100 జేసీబీలు ఉన్నాయా? మీది రిచ్​ కార్పొరేషనా? అని అడిగితే అదేం లేదు.. ఇదంతా ఫేక్​ న్యూస్​ అని ఆన్సర్​ ఇచ్చారు. హైడ్రా హెడ్​ రంగనాథ్ స్వయంగా వచ్చి ప్రజలు నివసించే ఇండ్లను కూలగొట్టడం లేదని ప్రెస్‌‌మీట్‌‌లో చెప్పారు. తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, జూబ్లీహిల్స్​ నియోజకవర్గ పరిధిలో హైడ్రా ఒక్క ఇంటినీ కూలగొట్టలేదని వివరించారు. 

మంత్రులు పొన్నం, అడ్లూరి మధ్య జరిగిన కాంట్రవర్సీలోకి మీ పేరెలా వచ్చింది?

మాల, మాదిగ ఇష్యూ తీసుకొచ్చి నాపై బురుద జల్లాలని కొందరు చూశారు. ఇటీవల జరిగిన మా నాన్న కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమంలో కూడా కల్చరల్​ డిపార్ట్‌‌మెంట్​ వాళ్లు చేసిన పనికి నన్ను విమర్శించారు. నా కొడుకు వంశీకి టికెట్​ ఇవ్వడానికి అప్పుడు కూడా తమాషా క్రియేట్​ చేసిన్రు. నార్త్​ తెలంగాణలో ఎక్కువ స్థానాలు బీజేపీ గెలిస్తే.. పెద్దపల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థిగా నా కొడుకు గెలిచిండు. నాకు మంత్రి పదవి ఇస్తున్నారంటే తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నించిన్రు. నేను అసలు కాంట్రవర్సీలకు పోను. ఆ రోజు జరిగిన ప్రోగ్రామ్‌‌లో నేను కూడా పొల్గొన్నా. ఇది అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌కు సంబంధించిన శాఖ కార్యక్రమం. నేను, పొన్నం ప్రభాకర్​ వచ్చి కూర్చున్నం. మంత్రి లక్ష్మణ్​ కుర్చీ ఖాళీగా ఉంది. 

ప్రెస్‌‌మీట్​ స్టార్ట్​ చేయాలని నిర్వాహకులకు చెప్పాను. మంత్రి లక్ష్మణ్​ వస్తే తప్ప ప్రెస్‌‌మీట్​ స్టార్ట్​ చేయలేమని వారు నాతో అన్నారు. నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత జరిగిన ప్రోగ్రామ్‌‌లో కూడా నేను, మంత్రి లక్ష్మణ్​ కలిసే పాల్గొన్నం. మైనారిటీ గురుకుల విద్యార్థినుల కోసం చేపట్టిన ప్రోగ్రాం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేను చెప్పిన. ఫస్ట్​ డే నా పేరు ఇన్వాల్వ్​ చేయలేదు. రెండో రోజు నుంచి నన్ను ఇరికించిన్రు. కొందరు కావాలని నా మీద బురద జల్లుతున్నరు. అలా చేయకుంటే వాళ్లకు న్యూస్​ ఐటం రాదు కదా?

బీసీ రిజర్వేషన్లపై మీ అభిప్రాయమేంటి?

బీసీ రిజర్వేషన్ల గురించి నేను ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా జాతి ప్రజల కోసం కొట్లాడిన. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లను 18 శాతం పెంచుతామని హామీ ఇచ్చినం. ఆ ప్రకారం చేయాలని కోరిన.  ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపై ఎవరూ మాట్లాడలే. ఉమ్మడి ఏపీలో జరిపిన 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు చేస్తే నష్టం జరుగుతుంది. ఎస్సీ జనాభా కోసం కొత్తగా సర్వే చేపట్టాలని కోరా. అంతేకానీ నాపై అన్​వాంటెడ్​ ఫాల్స్ అలిగేషన్స్​ తీసుకురావద్దని కోరుతున్న. మాల, మాదిగ గొడవలను నాపైకి తీసుకురావద్దు.

నవీన్ యాదవ్​కే  టికెట్​ ఎందుకు ఇచ్చిన్రు..?

కాంగ్రెస్​ పార్టీలో గ్రూపులు సహజం.  మీడియా దృష్టిలో దీనిని నెగెటివ్​ అనుకుంటే మేం దీనిని స్ట్రెంత్​ అనుకుంటం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన అజారుద్దీన్‌‌కు పార్టీ తరఫున అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.  పార్టీ హైకమాండ్​అంతా  ఆలోచించే నవీన్​ యాదవ్‌‌కు టికెట్​ కన్ఫర్మ్​ చేసింది. అతనికి టికెట్​ ఇవ్వడం వల్ల బీజేపీ హిందూ, ముస్లిం ఓటర్లను విభజించే పాలసీ వర్కవుట్​ కాకుండా పోయింది. 

బీజేపీ, బీఆర్ఎస్​ పార్లమెంట్​ ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందం చేసుకున్నయ్​. కాంగ్రెస్​ పార్టీ సెక్యులర్​ పార్టీ. జూబ్లీహిల్స్‌‌లో కచ్చితంగా  గెలిచేది మా అభ్యర్థే.  అంజన్‌‌ కుమార్ ​యాదవ్‌‌ అలకబూనితే పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌‌తోపాటు ఇద్దరు మంత్రులం వెళ్లి ఆయనను కలిసి పార్టీ లైన్​ వివరించినం.  2 సార్లు ఎంపీగా గెలిచిన అంజన్​ కుమార్​ యాదవ్​ సేవలను పార్టీ మంచిగానే వినియోగించుకుంటుందని మీనాక్షి నటరాజన్​ ఆయనకు హామీ ఇచ్చారు. 

మీరు చెన్నూర్​కు వెళ్లడంలేదంటున్నారు?

ఇదంతా గోబెల్స్​ ప్రచారం. చెన్నూర్​ ప్రజలకు నేనేంటో తెలుసు. గతంలో అప్పటి ఎమ్మెల్యే సుమన్​ నెలకు ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాకపోయేది. నేను వారంలో 2 సార్లు చెన్నూర్‌‌‌‌కు వెళ్తున్నా. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. మంత్రిని అయినా కూడా నా టాప్​ ప్రయారిటీ చెన్నూరే. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు, ఉమ్మడి మెదక్​ జిల్లా ఇన్‌‌చార్జిగా నాకు బాధ్యతలు ఇవ్వడంతో అక్కడ కాంగ్రెస్​ పార్టీ స్ట్రాంగ్​ అవుతున్నది. 

ఇది తట్టుకోలేక బీఆర్ఎస్​ పార్టీ నన్ను వీక్​ చేయాలనే ఉద్దేశంతో ఈ దుష్ప్రచారం చేస్తున్నది. సిద్దిపేటలో కూడా పార్టీ లోకల్​ లీడర్లతో టచ్‌‌లో ఉంటున్నా. గతంతో పోలిస్తే ఇప్పుడక్కడ కాంగ్రెస్​ స్ట్రాంగ్​ అయ్యింది. చెన్నూర్‌‌‌‌లో అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్​ ఏర్పాటుచేస్తున్నం. త్వరలో రూ. 45 కోట్లతో పనులు  స్టార్ట్​ కాబోతున్నాయి. అమృత్​ స్కీం కింద చెన్నూరులో రూ.30 కోట్లు , క్యాతన్‌‌పల్లిలో రూ.40 కోట్లు, మందమర్రిలో రూ. 30 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టినం. ఏడాదిలో ఇంటింటికీ నల్లాలు వస్తాయి. చెన్నూరులో ప్రతి రోడ్డును వెడల్పు చేసినం. 

నాలాలు బాగుచేసినం, సీసీ రోడ్లు వేసినం. చెన్నూరులో అడిషనల్​ వాటర్​ సప్లయ్​ కోసం రూ.50 కోట్లు మంజూరు చేయడానికి ఇటీవల కేబినెట్‌‌లో చర్చించినం. త్వరలోనే ఈ నిధులతో పనులు చేపట్టబోతున్నం.  సింగరేణిలో కొత్త గనులు రాకుండా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం అడ్డుపడ్డది. దీనిని నేను మంత్రి అయిన తర్వాత సీఎం రేవంత్‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కొత్త బొగ్గు గనులు స్టార్ట్​ అయ్యేలా చర్యలు తీసుకున్నా. దీంతో చెన్నూరుకు కూడా ఒక బొగ్గు గని రాబోతున్నది. సింగరేణి పవర్​ ప్లాంట్‌‌ను​ 850 మెగావాట్లకు పెంపు చేస్తున్నం. త్వరలోనే  పనులు ప్రారంభమవుతాయి. దీని ద్వారా 5 వేల కొత్త ఉద్యోగాలొస్తాయి. 

చెన్నూరులో ఇసుక అక్రమ దందా ఆగిపోయిందా?  

చెన్నూరు అనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగాఇసుక  అక్రమ రవాణాను అరికట్టినం. దీనికి ప్రభుత్వ మైనింగ్​ లెక్కలే ఆధారం. గతంలో ఇసుక మైనింగ్​ ద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడది వెయ్యి కోట్లకు పెంచి రెవెన్యూ తీసుకురాబోతున్నం.  అలాగే, ఇసుక క్వారీల దగ్గర డ్రోన్​, సీసీ  కెమెరాలు వినియోగిస్తూ తప్పుడు విధానాలకు స్వస్తి పలికినం. 

ఒక వే బిల్లు మీద 10 లారీల్లో ఇసుక నింపడం, ప్రతీ లారీలో అదనంగా ఇసుక లోడ్​ చేయడంలాంటి తప్పుడు పనులకు పుల్ స్టాప్​ పెట్టినం. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వాలని భావిస్తున్నది. దీనికోసం మైనింగ్​ మినరల్​ కార్పొరేషన్​ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇసుక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందిస్తున్నాం.