రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా .. కావాలనే బీజేపీపై విషప్రచారం: సంజయ్

రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా ..  కావాలనే బీజేపీపై విషప్రచారం: సంజయ్

    

హుజూరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నదని, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ విష ప్రచారం చేస్తున్నదని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఎస్సీ, ఎస్టీల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలో సంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

స్వదేశీ పార్టీ బీజేపీకి, విదేశీ పార్టీ కాంగ్రెస్ కు మధ్య ఎన్నికల పోరు జరుగుతున్నదని అన్నారు. ‘‘వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. దీంతో ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకు తెర తీసింది. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటిస్తే.. పూర్తిగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రకారం.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు పంచి పెడతాం” అని తెలిపారు. 

కరీంనగర్​కు వినోద్ చేసిందేమీ లేదు.. 

రాజ్యాంగాన్ని మారుస్తామని కేసీఆర్ అన్నప్పుడు.. కాంగ్రెస్ నేతలు కనీసం నోరు మెదపలేదని సంజయ్ మండిపడ్డారు. ‘‘అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించింది. ఆయన చనిపోతే పార్థివదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబయికి పంపించిన నీచమైన పార్టీ కాంగ్రెస్” అని ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే భరోసా ఇవ్వలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఏనాడూ జనం గురించి పట్టించుకోలేదు. లేఖలు రాసుడు.. హైదరాబాద్ లో ఉండుడు తప్ప ఆయన సాధించిందేమీ లేదు” అని విమర్శించారు.