ఇల్లు కట్టుకునేదెలా..?

ఇల్లు కట్టుకునేదెలా..?

భద్రాచలం, వెలుగు: పట్టణంలో గృహ నిర్మాణాలకు చుక్కెదురైంది. ట్రాక్టర్ల యజమానులు సిండికేట్​గా మారడంతో ఇసుక, కంకర, మట్టి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సామాన్యులకు భారంగా మారింది. ధరల నియంత్రణపై దృష్టి సారించాల్సిన ఆఫీసర్లు మౌనంగా ఉంటున్నారు. ఈ కారణంగా ట్రాక్టర్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా లారీల్లో ఇసుక, మట్టి, కంకర తెచ్చుకుంటే వారిని అడ్డుకుంటున్నారు. పట్టణంలో ఓ వైద్యుడు ఇసుక తెప్పించుకుంటే అడ్డుకోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. అందరూ సిండికేట్ గా మారి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇసుక తీసుకొచ్చి స్టాక్ పెట్టి అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా అవసరమైన వారికి విక్రయిస్తున్నారు.

అడ్డంగా దోచుకుంటున్నరు..!

గతంలో ట్రాక్టర్ ట్రక్కు ఇసుక రూ.2200లు, మట్టి రూ.900లు, కంకర రూ.3600లకు అవసరమైన వారికి సరఫరా చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం ట్రాక్టర్ యజమానులు సిండికేట్​గా మారి ఇసుకకు రూ.3500లు, మట్టికి రూ.1600లు, కంకరకు రూ.4500లు ధర నిర్ణయించారు. గోదా వరి పరి వాహక ప్రాంతంలోనే ఉంటున్నా ఇసుక ధర పెరగడం శోచనీయం. ఊరు చుట్టూ ఇసుక ర్యాంపులు అధికంగా ఉన్నాయి. పట్టణానికి అతి స మీపంలోనే ఆంధ్రాలో విలీనమైన గుండాల ర్యాం పు కేవలం5 కి.మీల దూరంలో, బూర్గంపాడు మండలంలోని తాళ్లగొమ్మూరు ర్యాంపు 6 కి.మీల దూరంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇసుకను లారీల్లో తీసుకొచ్చి భద్రాచలం ఇండస్ట్రియల్​ఏరియాలో నిల్వ చేస్తున్నారు. రూ.17వేలకు ఒక లారీ లోడు తెస్తే 7 ట్రాక్టర్​ట్రిప్పుల మేర ఇసుక వస్తుంది. సీతారామ ప్రాజెక్టు కాల్వల నుంచి మట్టిని అక్రమంగా తెస్తున్నారు. పాల్వంచ మండలం తోగ్గూడెం నుంచి కంకర తీసుకొస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో ఐదు యార్డులు ఉన్నాయి. వీటిని కాదని ట్రాక్టర్ యజమానులు కలిసి ఇసుక, కంకర, మట్టి అమ్మకాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. వీరిని కాదని ఎవరైనా ఇసుక, మట్టి, కంకర తెస్తే అడ్డుకుంటున్నారు. తమ ధరకే తీసుకోవాలని డిమాండ్​చేస్తున్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అభివృద్ధి​ పనులు సాగుతున్నాయి. వాటికీ ఇసుకను రానీయడం లేదు. 

విచారణ చేయిస్తాం...
.
సిండికేట్ వ్యవహారంపై విచారణ చేయిస్తాం. అసలు ఇసుక తేవడానికే అనుమతులు లేవు. ట్రాక్టర్ యజమానులు ఎలా ధరలు నిర్ణయిస్తారు? కఠినంగా చర్యలు తీసుకుంటాం. బాధితులు ఉంటే నేరుగా మమ్మల్ని సంప్రదించాలి. చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాస్​యాదవ్, తహసీల్దార్

సిండికేట్ తో దోపిడీ సరికాదు..

ఇప్పటికే భద్రాచలంలో ఇళ్ల నిర్మాణాలు కుంటుపడ్డాయి. ఇప్పుడు ట్రాక్టర్ యజమానులు సిండికేట్​ పేరుతో ధరలు పెంచేసి దోపిడీ చేయడం సరికాదు. సామాన్యులను ఇబ్బందుల పాలు చేయొద్దు. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టాలి. - సంతోష్​కుమార్, భద్రాచలం