చెరువు అలుగు పారితే .. మార్కెట్ పనులు బంద్

చెరువు అలుగు పారితే .. మార్కెట్ పనులు బంద్

జవహర్​నగర్​లో నిర్మించే వెజ్, నాన్​వెజ్ మార్కెట్ దుస్థితి ఇది
ఏడాది దాటినా పిల్లర్ల దశలోనే.. నత్తనడకన కొనసాగుతున్న పనులు 
రూ. 7 కోట్ల ప్రజాధనం వృథా

జవహర్ నగర్ వెలుగు :  జమేడ్చల్ జిల్లా జవహర్​నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేసీఆర్ కూరగాయల మార్కెట్ సమీపంలో నిర్మించే వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధి జవహర్​గర్​లోని మార్కెట్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. చెరువు అలుగు పారే మార్గంలో మార్కెట్  నిర్మిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే వరదనీరు వచ్చి చేరుతుండగా.. పనులు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. సుమారు రెండు ఎకరాల్లో గతేడాది మంత్రి మల్లారెడ్డి మార్కెట్ పనులు ప్రారంభించగా ఇప్పటివరకు  పిల్లర్లకే పరిమితమయ్యాయి.

రూ. 7 కోట్ల తో  నిర్మిస్తుండగా..  ఇప్పుడే వరద నీరు పారుతుండగా..  పూర్తయిన తర్వాత తమ పరిస్థితి ఏంటని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు సక్రమంగా చేయడం లేదని , ఏడాది దాటినా ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోతుండగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని అధికారులు, లీడర్లు వృథా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పనులకు ఫండ్స్ తెస్తున్నామ ని జవహర్​నగర్  మేయర్ చెప్పడమే తప్ప.. ఎక్కడా అభివృద్ధి చేస్తున్నట్లు  కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్  కోసం సర్వే నం. 277లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి జిల్లా అడిషనల్ కలెక్టర్   కేటాయించారు.

ఆ తర్వాత సదరు స్థలాన్ని  ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో  పెట్టారు. దీంతో ఆ స్థలం ప్లాట్లుగా మారింది.  రూ. కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా ప్లాట్లు చేసి  అమ్ముకుంటున్నారని  స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఆ మార్కెట్​ను  కేసీఆర్ కూరగాయల మార్కెట్ సమీపంలో  సర్వే నం. ‘614/పీ’లోకి మార్చి నిర్మిస్తున్నారు. ఏదేమైనా  ప్రభుత్వ నిధులు సక్రమంగా సద్వినియోగం చేయాలని జవహర్ నగర్ వాసులు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్  కమిషనర్ రామలింగంను వివరణ కోరగా..  వెజ్ ,నాన్ వెజ్ మార్కెట్ పనులు వర్షాల కారణంగా నిలిపివేశామన్నారు.  వానలు తగ్గగానే వెంటనే ప్రారంభించి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.