హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంలు 10 నుంచి 25 శాతం దాకా పెరుగుదల

హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంలు 10 నుంచి 25 శాతం దాకా పెరుగుదల

వెలుగు బిజినెస్​ డెస్క్​: హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఈ ఏడాదిలో తడిసి మోపెడయినట్లు కన్జూమర్లు మొత్తుకుంటున్నారు. 2022లో ఈ ప్రీమియం అమౌంట్​ 25 శాతం దాకా ఎక్కువైనట్లు  దేశంలోని ప్రతి అయిదుగురిలో ముగ్గురు చెబుతున్నట్లు లోకల్​ సర్కిల్స్​ సర్వేలో వెల్లడైంది. అంతకు ముందు ఏడాది అంటే 2021లో అయితే ఏకంగా 50 శాతం దాకా హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం మొత్తం పెరిగిందని 38 శాతం మంది కన్జూమర్లు వెల్లడించినట్లు ఈ సర్వే పేర్కొంది.

గవర్నమెంట్​ స్కీములో ఉంటేనే బెటర్​....

ఇలా హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం భారీగా పెరగడంతో  గవర్నమెంట్​హెల్త్​కేర్​ స్కీములోనో, లేదా ఇతర ఇన్సూరెన్స్​ స్కీములోనో కవరేజ్​ ఉంటే బాగుంటుందని కన్జూమర్లు భావిస్తున్నట్లు లోకల్​ సర్కిల్స్​ సర్వే తెలిపింది. ఎందుకంటే హెల్త్​ ఇన్సూరెన్స్​ కవరేజ్​ లేకుండా మనుగడ సాగించడం కష్టమని, ఇదే సమయంలో పెరిగిన ప్రీమియంలను తట్టుకోవడమూ అంతకంటే కష్టంగా మారిందని కన్జూమర్లు వాపోతున్నారు. దేశంలోని అందరికీ 2030 నాటికి యూనివర్సల్​ హెల్త్​కేర్​ తీసుకొస్తామని ప్రభుత్వ చేసిన ప్రామిస్​ఎప్పుడు నిజమవుతుందా అని చాలా మంది కన్జూమర్లు ఎదురు చూస్తున్నారని సర్వే రిపోర్టు వెల్లడించింది. తమ సొంత పొదుపు మొత్తాల నుంచి కొంత తీసి మెడికల్​, యాక్సిడెంటల్​ ఇన్సూరెన్స్​ పాలసీలు తీసుకున్నా, అవెంత వరకూ తమను కాపాడుతాయోనని కన్జూమర్లు ఆందోళన పడుతున్నట్లు పేర్కొంది. హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంలు భారీగా పెరిగాయంటూ వేలాది మంది సోషల్​ మీడియాలో పోస్టులు, కామెంట్ల రూపంలో వెల్లడించడంతో దేశవ్యాప్తంగా ఈ సర్వేను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లోకల్​ సర్కిల్స్​ తెలిపింది. దీంతో ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2022 మధ్యలో దేశంలోని 287 జిల్లాలలోని 20 వేల మందితో తాజా సర్వేను జరిపినట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది మగవారు కాగా, 33 శాతం మంది మహిళలని వివరించింది. అదేవిధంగా పార్టిసిపెంట్లలో 47 శాతం మంది మెట్రో లేదా టైర్​1 సిటీల వారయితే, 35 శాతం మంది టైర్​ 2 సిటీలు, మరో 18 శాతం మంది టైర్​3, టైర్​4 సిటీలకు చెందిన వారని లోకల్​ సర్కిల్స్​ పేర్కొంది.

గత ఏడాది కాలంలో ఇన్సూరెన్స్​ ప్రీమియం ఖర్చు ఎంత పెరిగిందని 10 వేల మంది రెస్పాండెంట్లను ప్రశ్నించగా,  50 శాతం కంటే ఎక్కువేనని 38 శాతం మంది పేర్కొన్నట్లు సర్వే రిపోర్టు తెలిపింది. మరో 24 శాతం మంది తమ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఖర్చు 25 నుంచి 50 శాతం మధ్యలో పెరిగిందని వెల్లడించినట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 28 శాతం మంది మాత్రమే తమ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఖర్చు తగ్గిందని చెప్పారు. హెల్త్​ ఇన్సూరెన్స్​ బాధ్యతను   ఎంప్లాయర్​ తీసుకోవడంతో వీరిలో చాలా మందికి ఖర్చు ఎంత పెరిగిందో తెలియదని  లోకల్​ సర్కిల్స్​ సర్వే రిపోర్టు వెల్లడించింది.​ 

2022లో మరీ ఎక్కువైంది..

సర్వేలో పాల్గొన్న వారి సమాధానాలను బట్టి చూస్తే, ఇన్సూరెన్స్​ ప్రీమియం మొత్తం భారంగా మారడంతో కన్జూమర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారనేది స్పష్టమవుతోందని లోకల్​ సర్కిల్స్​ పేర్కొంది. అంతకు ముందు ఏడాది అంటే 2021లో హెల్త్​ ఇన్సూరెన్స్​ ఖర్చు 25 శాతం దాకా పెరిగిందని 34 శాతం మంది చెబితే, ఈ ఏడాది ప్రీమియం ఎక్కువైందని ఏకంగా 62 శాతం మంది చెప్పడం గమనించాలని 
వివరించింది.

సీనియర్​ సిటిజన్లకు రెట్టింపైంది...

కరోనా మహమ్మారి తర్వాత హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంలు 10 నుంచి 25 శాతం దాకా పెరిగినట్లు ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఇలా ప్రీమియం పెరగడానికి చాలా కారణాలున్నాయని, మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో క్లెయిమ్​ల చెల్లింపులు బాగా ఎక్కువవడం ఒకటని వివరిస్తున్నారు. పాలసీ బజార్‌‌డాట్‌కామ్​ లెక్కల ప్రకారం చూస్తే సీనియర్​ సిటిజన్ల హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంలు ఏకంగా నూరు శాతం పెరిగినట్లు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారి విషయంలో ప్రీమియం ఖర్చు రెట్టింపైనట్లు లోకల్​ సర్కిల్స్​ ప్లాట్​ఫామ్​పై ఫీడ్​బాక్​ ద్వారా తెలుస్తోంది. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులకు కలిపి 2019–20లో ప్రీమియం మొత్తం రూ. 28 వేలుండేదని, ఇప్పుడది రూ. 55 వేలు–రూ. 60 వేలు మధ్యకి పెరిగిందని చెబుతున్నారు. మొత్తం మీద ప్రతి అయిదుగురిలో ముగ్గురు 2022లో  ఇన్సూరెన్స్​ ప్రీమియం 25 శాతం దాకా  పెరగడాన్ని అనుభవించినట్లు తేలుతోందని లోకల్​ సర్కిల్స్​ సర్వే పేర్కొంది. 2021లో  హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం 50 శాతం దాకా పెరిగిందని, 2022లో పెరిగినది దీనికి అదనమని తేలుతోందని లోకల్​ సర్కిల్స్​ సర్వే వివరించింది.