మిగతా దేశమంతా లాక్ ఓపెన్

మిగతా దేశమంతా లాక్ ఓపెన్

కంటైన్​మెంట్​ వరకే మరోనెల లాక్​డౌన్

దేశం తలుపులు తెరుచుకుంటున్నయ్. మూసుకుపోయిన దారులు ఓపెన్ అవుతున్నయ్. నాలుగు లాక్​డౌన్​లు గడిచినయ్.. ఆంక్షల మధ్య దాదాపు 70 రోజులు నడిచినయ్.. ఇక రేపటి నుంచి ‘అన్​లాక్-1’ షురూ కాబోతోంది. ఇన్నాళ్లు లాక్​డౌన్ నుంచి సడలింపులు ఇస్తూ వచ్చిన  కేంద్ర ప్రభుత్వం.. ఇక దేశాన్ని రీ ఓపెన్ చేయడంపై దృష్టి పెడుతోంది. మూడు ఫేజ్​లలో నార్మల్​ లైఫ్​లోకి ఎంటర్ అవ్వాలని భావిస్తోంది. ఏదేమైనా.. లాక్​డౌన్ ఉన్నా లేకున్నా.. ముఖానికి మాస్క్.. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం.. ఆరడుగుల దూరం.. ఇవే మనకు శ్రీరామరక్ష!

ఫేజ్-1

హోటళ్లు, రెస్టారెంట్లు , ఇతర హాస్పిటా లిటీ సర్వీసులు. మతపరమైన ప్రార్థనా స్థలాలు. షాపింగ్ మాల్స్.

ఫేజ్-2

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చల తర్వాత స్కూళ్లు, కాలేజీలు, ఇతర ఎడ్యుకేషనల్, ట్రైనింగ్, కోచింగ్ ఇన్​స్టిట్యూషన్లు ఓపెన్ చేయడంపై జులైలో నిర్ణయం.

ఫేజ్-3

పరిస్థితులను బట్టి.. ఇంటర్నేషనల్ ఎయిర్​ట్రావెల్, మెట్రో రైల్, సినిమా హాళ్లు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్​ ఈవెంట్స్​, బార్లపై నిర్ణయం.

న్యూఢిల్లీ: కేవలం కంటెయిన్​మెంట్ జోన్లలో మాత్రమే లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ జూన్ 30 వరకు ఆంక్షలు ఉంటాయని వెల్లడించింది. ‘అన్ లాక్-1’ పేరుతో శనివారం సాయంత్రం కేంద్ర హోం శాఖ కొత్త గైడ్​లైన్స్ జారీ చేసింది. మూడు దశల్లో దేశాన్ని రీ ఓపెన్ చేయనున్నట్లు  చెప్పింది. తొలిదశలో జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. స్కూళ్లు, సినిమా హాళ్లు, మెట్రో సర్వీసులు క్లోజ్​లోనే ఉంటాయని, రెండు, మూడు దశల్లో చర్చించి, పరిస్థితిని బట్టి వీటిపై నిర్ణయం తీసుకుంటామని వివరించింది. డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్ట్ కింద జారీ చేసిన ఈ గైడ్​లైన్స్​ను రాష్ర్టాలు, యూటీలు డైల్యూట్ చేయకూడదని స్పష్టం చేసింది. నాలుగో దశ లాక్​డౌన్ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

బఫర్ జోన్లు గుర్తించాలి

జిల్లాల అథారిటీలు గుర్తించిన కంటెయిన్​మెంట్ జోన్లలో లాక్​డౌన్ కొనసాగుతుందని కేంద్రం చెప్పింది. కంటెయిన్​మెంట్ జోన్ల బయటి ప్రాంతాల్లో నిషేధం ఉన్న యాక్టివిటీలను జూన్ 1 నుంచి దశలవారీగా రీ ఓపెన్ చేస్తామని వెల్లడించింది. కొత్త కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున… కంటెయిన్​మెంట్ జోన్ల బయట ఉన్న బఫర్ జోన్లను రాష్ర్టాలు, యూటీలు గుర్తించాలని సూచించింది. బఫర్ జోన్లలో అవసరనమైనంత వరకు రిస్ర్టిక్షన్లను జిల్లాల అధికారులు విధించవచ్చని చెప్పింది. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి రాష్ర్టాలు, యూటీలు.. కంటెయిన్​మెంట్ జోన్ల బయట కొన్ని యాక్టివిటీలను నిషేధించవచ్చని లేదా ఆంక్షలు విధించవచ్చని తెలిపింది. కంటెయిన్​మెంట్ జోన్లలో అత్యవసర సేవలు కొనసాగుతాయని పేర్కొంది.  కంటెయిన్​మెంట్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్ధారించేందుకు, నిర్వచించేందుకు రాష్ట్రాలు, యూటీలకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. కంటెయిన్​మెంట్ జోన్లు, వాటి బయట ప్రజల మూమెంట్ ఉండకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యవసరాల సప్లై మాత్రం కొనసాగించాలని చెప్పింది. కంటెయిన్​మెంట్ జోన్లలో కాంటాక్ట్ ట్రేసింగ్ ఎక్కువగా చేపట్టాలని, ప్రతి ఇంటిపైనా నిఘా పెట్టాలని ఆదేశించింది.

నైట్ కర్ఫ్యూ టైం తగ్గింపు

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ సమయాన్ని తాజాగా తగ్గించారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు ఆంక్షలు ఉంటాయి. నిన్నటి వరకు సాయంత్రం 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉండేది. అత్యవసర సేవల్లో ఉన్న వాళ్లు తప్ప.. మిగతా వారు నైట్ కర్ఫ్యూ పాటించాలి.

వీళ్లు బయటికి రావద్దు..

65 ఏళ్లు పైబడిన వాళ్లు, ఇప్పటికే పలు వ్యాధులు ఉన్న వాళ్లు, ప్రెగ్నెంట్లు, 10 ఏళ్లలోపు పిల్లలు, ఇండ్లలోనే ఉండాలి. హెల్త్, ఎమర్జెన్సీ అవసరాలకు తప్ప.. మిగతా సమయాల్లో బయటికి రావద్దు.

రాష్ట్రాల మధ్య రవాణాకు ఓకే

రాష్ర్టాల మధ్య (ఇంటర్ స్టేట్), ఆయా రాష్ర్టాల్లో (ఇంట్రా స్టేట్) ప్రజలు తిరిగేందుకు, గూడ్స్ రవాణా చేసే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఇలాంటి ప్రయాణాలకు ఎలాంటి పాస్​లు, పర్మిషన్లు అవసరం లేదు.  అయితే ఆయా రాష్ట్రాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ప్రజారోగ్యం, స్థానిక పరిస్థితుల దృష్ట్యా  ఇంటర్ స్టేట్ ట్రావెలింగ్​పై రిస్ర్టిక్షన్లు పెట్టాలంటే సదరు రాష్ట్రం ప్రజలకు ముందే తెలియజేయాలి. ప్యాసింజర్ రైళ్లు, స్పెషల్ శ్రామిక్ ట్రైన్లు, డొమెస్టిక్ విమానాలు, ఇతర దేశాల్లో చిక్కుకున్న ఇండియన్లను రప్పించడం, అనుమతి ఉన్న వ్యక్తులు ఫారిన్​కు వెళ్లేందుకు, ఫారినర్లను సొంత దేశాలకు పంపేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న సేవలు యథాతథంగా కొనసాగుతాయి. గూడ్స్, కార్గో వెహికల్స్​ను నిలిపేసే హక్కు రాష్ర్టాలు, యూటీలకు లేదు.

ఇవి మస్ట్

పబ్లిక్ ప్లేసులు, వర్క్​ప్లేసుల్లో, ట్రాన్స్​పోర్ట్ టైంలో మాస్క్ కంపల్సరీ. పబ్లిక్ ప్లేసులు, ఇతర ప్రాంతాల్లో కనీసం 6 అడుగుల దూరం కచ్చితంగా పాటించాలి. ఏ షాపుల్లో అయినా ఐదుగురి కంటే ఎక్కువ కస్టమర్లు ఉండకూడదు.

ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఉండాలి.

కంపెనీలు 100 శాతం ఉద్యోగులతో నడపొచ్చు. వీలైనంత వరకు వర్క్​ఫ్రమ్​హోంకు అవకాశం ఇవ్వాలి.

ఆఫీసులను తరచుగా శానిటైజ్ చేయాలి.

గుళ్లు.. ఇతర ప్రార్థనా స్థలాలు తెరవడానికి అనుమతిచ్చినా అక్కడ ఎలాంటి ఉత్సవాలు జరగకూడదని కేంద్రం ఆదేశించింది. ఫేజ్​‑3లో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. త్వరలో జరగనున్న పూరీ జగన్నాథ్​ రథయాత్రకు శనివారం నుంచి ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే లక్షలాది మంది వచ్చే ఆ యాత్రకు ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అనేది సందేహమే!

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..