అర్హత లేని ఏజెన్సీలకు కాంట్రాక్టు!

అర్హత లేని ఏజెన్సీలకు కాంట్రాక్టు!
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అక్రమాలు
  • పాత ఏజెన్సీలు రద్దు చేసి మరీ అప్పగింత 
  • రూల్స్‌ను అతిక్రమించిన అధికారులు
  • ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్​ కాలేజీ, ఎంజీయూ, అగ్రికల్చర్ ​ఆఫీసుల్లో అధికారుల తీరు వివాదాస్పదం 

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కేంద్రంలో ఔట్​సోర్సింగ్​ఏజెన్సీల కాంట్రాక్టు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమకు అనుకూలమైన ఏజెన్సీలకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు అధికారులు రూల్స్​అతిక్రమించారు. పనిచేస్తున్న ఏజెన్సీలను పక్కన పెట్టి, అర్హత లేని ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.  ఇటీవల నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆ సుపత్రి, జిల్లా వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఏజెన్సీల కాంట్రాక్టు ఆగమే ఘాల మీద రద్దు చేసి, దానికి బదులు ముంబైకి చెందిన ఓ బినామీ ఏజెన్సీకి, నల్గొండకు చెందిన మరో ఏజెన్సీకి కాంట్రాక్టు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. లక్షలు తీసుకొని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
నల్గొండ ఆస్పత్రిలో అధికారుల నిర్వాకం..

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో 180 మంది సిబ్బంది ఔట్​సోర్సింగ్​ కింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. రూల్స్​ ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి ఏజెన్సీ రెన్యువల్​చేయాలి. మళ్లీ రీటెండర్​ పిలిచి కొత్త ఏజెన్సీని సెలక్ట్​ చేయాలి.  కానీ అధికారులు మాత్రం అగ్రిమెంట్​ప్రకారం ఇప్పుడున్న ఏజెన్సీ గడువు మూడేళ్లు కాకముందే క్యాన్సిల్​ చేశారు. ఇందుకు ఏజెన్సీ పనితీరు బాగాలే దని, సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వట్లేదని, పలువురు సిబ్బంది ఆత్మహత్యకు ప్రయత్నించారని కారణాలు చూపారు.  

రూల్‌‌ ప్రకారం జిల్లా అడిషనల్ కలెక్టర్, ఆస్పత్రి సూపరింటెండెంట్​, టీఎస్​ఎంఐడీసీ ఆఫీసర్లతో కూడిన కమిటీ సమగ్ర విచారణ చేశాకే కాంట్రాక్టు రద్దు చేయాలి. మళ్లీ ఆప్లేస్‌‌లో గతంలో టెండర్లు పిలిచినప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఉన్న ఏజెన్సీలకే ప్రియార్టీ ఇవ్వాలి. కానీ,  అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ఎలాంటి అర్హతలేని ముంబైకి చెందిన ఏజెన్సీకి కాంట్రాక్టు కట్టబెట్టారు. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీలు ఆఫీసులో లేకుండా రహస్యంగా దాచిపెట్టారు. పాత సూపరిం టెండెంట్​ఏసీబీకి పట్టుబడిన నెలరోజుల వ్యవధిలోనే మళ్లీ అదే స్థాయి కలిగిన ఆఫీసర్లు ఈరకంగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు ఆస్పత్రి సిబ్బంది తాము ఏ ఏజెన్సీ కింద పనిచేస్తున్నామో అర్థంకాగ ఆందోళ చెందుతున్నారు.  

మెడికల్​ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విలవిల

 మెడికల్​కాలేజీలో అధికారులు  ఆడుతున్న డ్రామాలో ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులు విలవిలలాడుతున్నారు.  కాలేజీలో 30 మంది స్టాఫ్​ ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. వీళ్లందరని ఔట్​సోర్సింగ్​ఏజెన్సీకి కింద నియమించి ఏడాది కావొస్తోంది. టెండర్లు పిలిచి మరీ ఏజెన్సీకి కాంట్రాక్టు  అప్పగించారు. కానీ ఆఫీషియల్​గా ఆర్డర్​ కాపీలు ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ఆర్డర్ కాపీ చేతికి ఇవ్వకపోవడంతో ఏజెన్సీ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఆపేసింది. 

ఇదేంటని అడిగితే ప్రభుత్వం మారినందున పైనుంచి మళ్లీ ఆర్డర్స్ రావాలని అధికారులు ముప్పుతిప్పులు పెడుతున్నారని సి బ్బంది ఆరోపిస్తున్నారు. ఇదే కాలేజీలో గతేడాది అక్టోబర్​120 పోస్టులకు టెండర్లు పిలిచి ఏజెన్సీని సెలక్ట్​ చేశారు. ఆరువేల మందికి పైగా నిరుద్యోగులు అప్లై చేసుకోగా, కమిటీ నిర్ణయం మేరకు అర్హత కలిగిన వాళ్లను సెలక్ట్​ చేశారు. కానీ, మెడికల్​ కాలేజీ ఆఫీసర్లు వర్క్ ఆర్డర్​ కాపీ ఇవ్వకుండా తొక్కిపట్టారు. ఇదేంటని అడిగితే రొటీన్​గానే సర్కార్​ మారింది కాబట్టి వెయిట్​ చేయాలని చెబుతున్నారని ఉద్యోగులు, ఏజెన్సీలు లబోదిబోమంటున్నాయి. 

వ్యవసాయ శాఖలో అదే తీరు..

జిల్లా వ్యవసాయశాఖలో 25 మంది సిబ్బంది వివిధ విభాగాల్లో ఔట్​ సోర్సింగ్​కింద పనిచేస్తున్నారు. జీతాలు సరిగా ఇవ్వడం లేదని హైదరాబాద్​కు చెందిన ఏజెన్సీ కాంట్రాక్టు క్యాన్సిల్​ చేశారు. కొత్త ఏజెన్సీని సెలక్ట్​ చేయడంలో అధికారులు రూల్స్ అతిక్రమించారు. నామినేటెడ్​ పద్ధతిలో తమకు నచ్చిన ఓ బినామీ ఏజెన్సీకి కాంట్రాక్టు కట్టబెట్టారు. ఇంకో నెల ఆగితే పాత ఏజెన్సీ కాంట్రాక్టు గడువు ముగుస్తుంది కాబట్టి ఒక్క నెల కోసం మళ్లీ టెండర్లు పిలవడం ఎందుకుని బినామీ ఏజెన్సీని తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. ఈ ఏజెన్సీనే మూడేళ్ల పాటు కంటిన్యూ చేస్తే సరిపోతుందని మరో హైడ్రామాకు తెరలేపారు. 

ఎంజీయూ, ఐటీ పార్క్‌‌లోనూ..

ఎంజీ యూనివర్సిటీలో కొత్తగా రెండు వందలకు పైగా ఔట్ సోర్సింగ్​ఉద్యోగాలకు నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. దీంతో పాటు, ఐటీ పార్క్​లో పనిచేసేందుకు కూడా ఔట్​సోర్సింగ్​ నియామకాలు త్వరలో మొదలు కానున్నాయి. ఈ రెండు చోట్ల టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే టెండర్లు పిలవకుండా నామినేటెడ్​ బేసిస్​లో తాము చెప్పిన ఏజెన్సీకి కాంట్రాక్టు ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల అనుచరుల పైరవీలు తమకు తలనొప్పిగా మారాయని వర్సిటీ అధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పడం గమనార్హం. 

లక్షలు పలుకుతున్న ఉద్యోగాలు!

ఔట్​సోర్సింగ్​సిబ్బందికి ప్రభుత్వ ఆస్పత్రిలో నెల జీతం రూ.11వేలు, యూనివర్సి టీలు రూ.15వేలకు పైగా, ఇంకొన్ని డిపార్ట్​మెంట్​లో రూ.20 వేల వరకు వస్తోంది. మూడు, నాలుగో తరగతి కేడర్‌‌లో ఉండే ఈ ఉద్యోగాలకు డిగ్రీ, పీజీ, ఇంజినీరిం గ్​, బీఈడీ చేసిన వాళ్లు సైతం పోటీ పడుతుండడంతో డిమాండ్ పెరిగింది.   మెడికల్​కాలేజీ లో 120 పోస్టులకు 6వేల మంది అప్లై చేయడమే అందుకు నిదర్శనం. చిన్న ఉద్యోగం అయినా ప్రభుత్వశాఖలో పని కావడం,  కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగాలను ప్రభుత్వం ఎప్పటికైనా రెగ్యులర్​ చేస్తుందనే నమ్మకంతో ఆసక్తి చూపుతున్నారు.  దీన్ని ఆసరాగా చేసుకుంటున్న  ఏజెన్సీలు, అధికారులు  రాజకీయ పలుకుబడితో ఉద్యోగాలకు సెలక్ట్​ అయిన అభ్యర్థుల నుంచి  లక్షల రూపాయాలు  వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  పైరవీతో వచ్చిన వాళ్లకైతే ఆ రేట్​ సపరేట్‌గా ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.