వర్సిటీల కాంట్రాక్టు లెక్చరర్లను.. రెగ్యులరైజ్​ చేయాలి

వర్సిటీల కాంట్రాక్టు లెక్చరర్లను.. రెగ్యులరైజ్​ చేయాలి

వి శ్వవిద్యాలయాలు భావిభారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దే కేంద్రాలు. సమాజంలోని అభివృద్ధికర మార్పులకు పురుడు పోసే ప్రదేశాలు. ఇలాంటి నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకులు ఏండ్ల తరబడి సేవలందిస్తూ భద్రత లేని ఉద్యోగం, చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలో 12 వర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిల్లో 1356 మంది గత 25 ఏండ్లుగా ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులరైజ్ ​చేయాలని గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభలో ప్రస్తావించారు.

కానీ నేటి వరకు కూడా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయలేదు. ఉద్యమ సమయంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని నాటి ఉద్యమ నేత నేటి రాష్ట్ర సీఎం కేసీఆర్​కూడా ప్రకటించారు. కానీ రాష్ట్రం సాధించి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేయకపోవడం. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను శాశ్వత ప్రాతిపదికన నియమించేందుకు ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభ సమావేశంలో మొదటి ఫైల్ పై సంతకం చేసిన ముఖ్యమంత్రి.. విశ్వవిద్యాలయాల్లో  పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల గురించి విస్మరించారు. అటు శాశ్వత ప్రాతిపదికన లెక్చరర్లను నియమించకుండా, ఇటు ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయకపోవడంతో వర్సిటీల్లో విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. 

విశ్వవిద్యాలయాల్లో 72.23 శాతం ఖాళీలు 

భారత దేశవ్యాప్తంగా 1,057 విశ్వవిద్యాలయాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో 54 సెంట్రల్‌‌ యూనివర్సిటీలు, 453 స్టేట్‌‌ యూనివర్సిటీలు, 126 డీమ్డ్‌‌ యూనివర్సిటీలు, 410 ప్రైవేట్‌‌ విశ్వవిద్యాలయాలు, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన తొలి 500 విశ్వవిద్యాలయాల్లో భారతదేశానికి చెందిన 8 యూనివర్సిటీలు, తొలి 1,000 విశ్వవిద్యాలయాల్లో 35 మాత్రమే ఉండటం మన ఉన్నత విద్యాసంస్థల విద్యా ప్రమాణాల తీరును కళ్లకు కడుతున్నాయి. ఈ 12 విశ్వవిద్యాలయాల్లో 72.23 శాతం ఖాళీలు ఉన్నాయి. అంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ మూడు కలిపి రాష్ట్రంలోని12 విశ్వవిద్యాలయాల్లో 2880 పోస్టులకు గాను కేవలం 800 మంది మాత్రమే ఉన్నారు.

సుమారు 2080 పోస్టుల వరకు(72.23 శాతం పోస్టులు) ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు మొత్తం కూడా కేవలం1356(పీవీ నరసింహారావు వెటర్నటీ యూనివర్సిటీలో 22 మందితో కలిపి). వీరందరినీ రెగ్యులరైజ్ చేసినా ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్లో పార్ట్ టైం అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని విద్యా సంస్థల్లోని కాంట్రాక్ట్  అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ క్రమబద్ధీకరించాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న12 విశ్వవిద్యాలయాల్లో సుమారు రెండు వేల పోస్టులకు పైగా అవసరం. ఈ పోస్టులను కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు  గత 20 ఏండ్ల నుంచి ఇప్పటికీ నడుస్తున్నాయి. అయితే అవి ఎంతో విజయవంతంగా నడుస్తున్నా.. ప్రభుత్వం వాటిని రెగ్యులర్​ కోర్సులు చేయడం లేదు. దీంతో వాటికి రెగ్యులర్​అధ్యాపకులతోపాటు, యూజీసీ నుంచి నిధులు రావడం లేదు.

అందరికీ న్యాయం చేయాలి..

విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేకమంది మేధావులు, లాయర్లు, జడ్జిలు, విద్యావేత్తలు వివిధ వేదికలపై చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తవుతున్నా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల బతుకులు ఇంకా అలాగే ఎందుకు ఉండాలి? ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో  కాకతీయ యూనివర్సిటీలో జరిగిన మాజీ ఉపకులపతుల సదస్సులో, జేఎన్టీయూహెచ్ హైదరాబాదులో జరిగిన సదస్సులో అనేకమంది మేధావులు, మాజీ వీసీలు, లాయర్లు , జస్టిస్​లు, రెగ్యులర్ అధ్యాపకుల సంఘం నేతలు మాట్లాడుతూ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరేషన్ ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యమవుతుందన్నారు. అన్ని సందర్భాల్లో వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల గురించిన ప్రస్తావన వస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలి.

సత్వర పరిష్కారాలు చూపాలి

విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాలకు సంబంధించిన ఫైల్ ముందుకు కదలకపోవడంతో నష్టం జరుగుతున్నది. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడటం, అవసరమైన నిధులు కేటాయించడం, విద్యను పరిశోధనలకు ముడిపెట్టడం, విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిని కాపాడటం, పాలనా సంస్కరణలు తేవడం, క్యాంపస్‌‌లో విద్య వాతావరణాన్ని నెలకొల్పడం, అధ్యాపకుల నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించడం, ఆధునిక డిజిటల్‌‌ యుగ మేధో వికాసం ఫలించడం, నైపుణ్య యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఇప్పుడు ఎంతో అవసరం. ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడం, అశాంతితో ఎదురు తిరగడం, నిరుద్యోగం పెరిగిపోవడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకే పాలకులు సమస్యలకు సరైన సత్వర పరిష్కారాలు చూపాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందర్నీ రెగ్యులరైజ్ చేయడం చాలా అవసరం. దీంతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బలోపేతం అవుతాయి. గత 50 రోజుల నుంచి కూడా విశ్వవిద్యాలయాల్లో రోజూ ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నడుస్తూ ఉన్నాయి.

- డా. శ్రీధర్ కుమార్, జేఏసీ చైర్మన్, తెలంగాణ వర్సిటీల కాంట్రాక్ట్ టీచర్స్