అధికారుల నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్​లు పనులను ఆలస్యం

అధికారుల నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్​లు పనులను ఆలస్యం

ఆదిలాబాద్​ టౌన్,వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో రూ.కోట్ల నిధులతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణ వాసులు నరకం చూస్తున్నారు. ఆదిలాబాద్​ఎన్టీఆర్ చౌక్​ నుంచి వినాయక్​చౌక్​ వరకు ఉన్న 750 మీటర్ల డబుల్ రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం రూ. 5.35 కోట్లు మంజూరు చేసింది. పనుల కోసం గత ఏడాది నవంబర్​లో అగ్రిమెంట్​పూర్తయ్యింది. వచ్చే నవంబర్​ వరకు పనులను పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సగం కూడా పూర్తి కాలేదు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు చోట్ల కల్వర్టుల కోసం తవ్వడంతో వర్షం కురిసినప్పుడల్లా గుంతల్లో నీరునిండి ప్రమాదకరంగా మారుతున్నాయి. పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే రోడ్డు పనులు స్లోగా సాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వన్​వే ఉండడం.. ఎదురెదుగా వాహనాలు వస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఎక్కడిపడితే అక్కడ భగీరథ పైపులను తవ్వి పడేయడంతో  మంచినీటి సరఫరా నిలిచిపోయింది.

 

ఆఫీసర్లు కూడా ఎక్కడ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదు. ప్రధాన కూడళ్లలో రూ.5 కోట్ల నిధులతో చేపట్టిన సుందరీకరణ పనులూ స్లోగా సాగుతున్నాయి. మరోవైపు రాంగనగర్, హనుమాన్ మందిర్​ నుంచి లాండసాంఘ్వి రోడ్డు  వరకు ఉన్న 4.6 కిలో మీటర్ల రోడ్డు విస్తరణ, డివైడర్లు, లైటింగ్​ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.44.3 కోట్లు మంజూరు చేసింది. 2018 డిసెంబర్​లో పనులు ప్రారంభమయ్యాయి.  జులై 2020 నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉండగా రైల్వే స్టేషన్ ముందు నుంచి లాండా సాంఘ్వి రోడ్డు  వరకు ఉన్న 500 మీటర్ల రోడ్డు విస్తరణ పూర్తి కాలేదు. కోర్టు కేసు కారణంగా పనులు నిలిపివేశౄమని, మిగితా పనులన్నీ పూర్తి చేశామని అధికారులు పేర్కొంటున్నారు. కానీ... డివైడర్ల పనుల్లో నాణ్యత లోపించడం... అసంపూర్తిగా పనులు చేయడంతో కొన్నిచోట్ల వర్స్​ అలాగే మిగిలిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్​లు పనులను ఆలస్యం చేస్తున్నారని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గడువులోగా పనులు పూర్తి చేస్తాం 

నెల రోజుల పాటు వర్షాలు కురవడం.. రోడ్డు కింద భగీరథ పైపులు ఉండడం కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ఓవైపు పనులను పూర్తి చేశాం. రైల్వే స్టేషన్  నుంచి లాండసాంఘ్వి రోడ్డు వరకు గల 500 మీటర్ల పనులు కోర్టు కేసు కారణంగా నిలిచిపోయాయి.

- ఆర్.సురేశ్, డీఈ, ఆర్​అండ్​బీ

ఆఫీసర్లు పట్టించుకోవాలి..

ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతోనే రోడ్డు పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. పెరిగిన ట్రాఫిక్​తో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డుపై ఎదురెదురుగా వాహనాలు వస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

-కె.ప్రవీణ్, ఆదిలాబాద్​