హుజూర్​నగర్​ టీఆర్ఎస్​లో రచ్చ

హుజూర్​నగర్​ టీఆర్ఎస్​లో రచ్చ
  • గతంలో గుంటూరు జిల్లాలో మంతనాలు
  • తాజాగా జిన్నారెడ్డి బర్త్ డే లో బయటపడ్డ విభేదాలు
  • ఏకమవుతున్న ఎమ్మెల్యే వ్యతిరేకులు, తెలంగాణ ఉద్యమకారులు..

సూర్యాపేట, వెలుగు:  హుజూర్‌నగర్ టీఆర్ఎస్​లో అసమ్మతి రగులుతోంది. నియోజకవర్గ నాయకత్వంపై క్యాడర్​ధిక్కార స్వరం వినిపిస్తోంది.  కొంత కాలంగా ఎమ్మెల్యే తీరుపై టీఆర్ఎస్​ ఎంపీపీలు గుర్రుగా ఉన్నారు. కొందరు  బాహాటంగా గళం విప్పుతుండగా  మరికొందరు అవకాశం దొరికినప్పుడల్లా వేడుకల పేరుతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. క్రమంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బలపడుతుందనే చర్చ  జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే  సొంత బంధువులకు ప్రియారిటీ ఇస్తూ..పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకుంటలేరని ఎంపీపీలు విమర్శిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే  పక్కకు పెడ్తున్నారని తెలంగాణ ఉద్యమకారులను, పార్టీ సానుభూతి పరులను ఏకం చేస్తున్నారు. 

వరుస భేటీలు.. 

ఇటీవల ఎమెల్యేకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని  ఎంపీపీలు వరుసగా రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు.  గత వారం ఓ పెండ్లి దావత్ కు నియోజకవర్గ టీఆర్ఎస్​ఎంపీపీలు గుంటూరు జిల్లా.. పిడుగురాళ్లలోని  ఓ హోటల్ లో సీక్రెట్ గా కలుసుకున్న  ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు రోజుల కింద టీఆర్ఎస్ నియోజకవర్గ​ ముఖ్యనాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాస్​రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్యే వ్యతిరేకులంతా పాల్గొన్నారు. ఈ వేడుకలో పార్టీ లో సీనియర్లకు జరుగుతున్న అవమానాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్  కార్యాచరణ పై  చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా శ్రీకాంతచారి తల్లి  శంకరమ్మతో పాటు   ప్రతి పక్ష నాయకులు కొందరు  పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో శంకరమ్మ తిరిగి పోటీ చేయాలని  పలువురు లీడర్లు సూచించినట్లు తెలుస్తోంది.   

 ఎమ్మెల్యే సన్నిహితులకు కాంట్రాక్టులు..

 నియోజకవర్గంలోని టీఆర్ఎస్​ఎంపీపీలు, జడ్పీటీసీలకు ఎమ్మెల్యే సరైన ప్రాధాన్యం ఇస్తలేరన్న ఆరోపణలుండగా.. పార్టీ మీటింగ్​లలో కూడా సీనియర్లను కాకుండా,  జూనియర్లకు  ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఎంపీపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టుల విషయంలో కూడా ఎమ్మెల్యే తన అనుచరులకే  వర్క్స్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్​పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన జిన్నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి హుజూర్ నగర్  బై ఎలక్షన్​టైంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా  శ్రమించగా..  ఎలక్షన్​తర్వాత  ఎమ్మెల్యే, ఆయనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో  మంత్రి జగదీశ్​రెడ్డితో టచ్​లో ఉంటూ  ఎమ్మెల్యే వ్యతిరేక లీడర్లతో ఒక వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.  హుజూర్‌నగర్  ఎంపీపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లో  చేరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి హామీతో  పార్టీలో చేరగా, ఆయనను ఎమ్మెల్యే సైదిరెడ్డి పట్టించుకోకపోవడం,  మిగతా ఎంపీపీలకు ఏదో ఒక  కాంట్రాక్టులు ఇచ్చి, ఆయనకు  ఏ కాంట్రాక్టూ ఇవ్వక పోవడంతో  గుర్రుగా ఉన్నట్లు  తెలుస్తోంది. ఇలా నియోజకవర్గ టీఆర్ఎస్​లో రచ్చ రచ్చ సాగుతోంది.