రసాభాసగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

రసాభాసగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ ఆఫీస్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ ​లింగాల కమల్​రాజు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. భట్టి జిందాబాద్.. అంటూ కాంగ్రెసోళ్లు,  జై లింగాల.. జై కేసీఆర్..  అంటూ టీఆర్ఎసోళ్లు బాహాబాహికి దిగారు. ఉదయం 11గంటలకు సభ స్టార్ట్​కావాల్సి ఉండగా ముఖ్య అతిథి అయిన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆలస్యంగా వచ్చారు. అనంతరం జడ్పీ చైర్మన్ ​కమల్ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సమయపాలన పాటించాలని, సకాలంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని సూచించారు. భట్టి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్​లో డబ్బులు లేక  చెక్కులు ఇన్​టైంలో మంజూరు కావడం లేదన్నారు. మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను లేట్​కాకుండా అందజేయాలని తహసీల్దార్​కు గతంలోనే చెప్పామన్నారు. అంతలోకి జడ్పీ చైర్మన్ మధ్యలో కలుగజేసుకుని మండల  ప్రజాప్రతినిధులు లేకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించడంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్​కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మధిర ట్రైనీ ఎస్సై షకీర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అనంతరం 46 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.